అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మిచిగాన్ స్టేట్ వర్సిటీలో ఓ దుండుగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈస్ట్ లాన్సింగ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్పారో ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.
విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు భద్రతాపరమైన ఏర్పాట్లు చేశామన్నారు. కాల్పుల నేపథ్యంలో వర్సిటీ కార్యకలాపాలన్నింటీని అధికారులు రద్దు చేశారు. స్థానిక కాల మానం ప్రకారం… సోమవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు వర్సిటీలోని బెర్కె హాల్ లో కాల్పులు జరిగాయని క్యాంపస్ పోలీస్ డిపార్ట్ మెంట్ తాత్కాలిక డిప్యూటీ చీఫ్ క్రిస్ రోజ్ మెన్ వెల్లడించారు.
స్టూడెంట్ యూనియన్ భవనం వద్ద కూడా అతను కాల్పులు జరిపినట్టు ఆయన పేర్కొన్నారు. ఎర్రని బూట్లు, జీన్ జాకెట్, టోపీ, మాస్క్ ధరించిన పొట్టిగా ఉన్న నల్ల జాతి వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్టు గుర్తించామని పోలీసులు అన్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు.
సమాచారం అందిన వెంటనే క్యాంపస్ ను పోలీసులు చుట్టుముట్టారన్నారు. క్యాంపస్ లోపలే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విద్యార్థులకు సూచించామన్నారు. నిందితుడు ఇంకా క్యాంపస్ లోనే ఉన్నట్టు తెలుస్తోందన్నారు. ఈ విషయమై తమకు ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు.