చైనాకు చెందినదిగా భావిస్తున్న స్పై బెలూన్ ను అమెరికా కూల్చి వేసింది. తూర్పు తీర ప్రాంతంలో చెైనా స్పై బెలూన్ ను కూల్చి వేసినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు విషయాన్ని పెంటగాన్ అధికారులు వెల్లడించారు. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినందుకు చైనాకు సమర్థవంతమైన సమాధానం ఇచ్చామన్నారు.
అధ్యక్షుడు జో బిడెన్, అతని జాతీయ భద్రతా బృందం ఎల్లప్పుడూ అమెరికన్ ప్రజల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని నేటి ఉద్దేశపూర్వక, చట్టబద్ధమైన చర్య నిరూపిస్తుందని రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ అస్టిన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
దీనికి సంబంధించిన వీడియోలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. ఆ వీడియోల్లో మొదట చిన్న పేలుడు కనిపించింది. ఆ తర్వాత ఆ బెలూన్ నీటిలో పడిపోతున్నట్టు కనిపించింది. శిథిలాలన్నీ సముద్రంలో పడే విధంగా ఆపరేషన్ ను అధికారులు ప్లాన్ చేశారు.
బెలూన్ సముద్రంలో పడిపోతుండటంతో సముద్రంలో అమెరికా రక్షణ శాఖ నౌకలను మోహరించారు. బెలూన్ కు సంబంధిచిన శిథిలాను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతకు ముందు బెలూన్ గురించి మీడియా అడిగిన విషయంపై బిడెన్ స్పందిస్తూ… ఆ విషయాన్ని తాము చూసుకుంటామన్నారు. ఆయన వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే బెలూన్ ను అధికారులు కూల్చి వేశారు.