ఇండియాలో మానవ హక్కుల ఉల్లంఘనలు కొనసాగుతున్నాయని అమెరికా ఆరోపించింది. భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తున్నారని, నిరంకుశ అరెస్టులు, నిర్బంధాలు పెరిగిపోతున్నాయని, ఎలాంటి విచారణ లేకుండానే వ్యక్తుల ఆస్తులను నాశనం చేయడమో, స్వాధీనం చేసుకోవడమో జరుగుతోందని అమెరికా విదేశాంగ శాఖ ఓ నివేదికలో తెలిపింది. మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయని కూడా ఆరోపించింది. మానవ హక్కుల విభాగం లోని బ్యూరో ఆఫ్ డెమాక్రసీ శాఖ సీనియర్ అధికారి ఎరిన్ ఎం. బార్క్ లే ఈ రిపోర్టును విడుదల చేస్తూ ..ప్రజాసామ్యం మీద, మానవ హక్కుల మీద భారత-అమెరికా దేశాలు ఉన్నత స్థాయిలో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తున్నాయని తెలిపారు.
మానవ హక్కులకు సంబంధించి ఇండియా తన నిబధ్ధతకు కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నామని, తమ దేశంతో బాటు ఇండియాలోని సివిల్ సొసైటీలతో టచ్ లో ఉంటున్నామని ఆయన తెలిపారు. అయితే మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న ఆరోపణను ఇండియా ఖండిస్తున్నప్పటికీ.. తమ దేశానికి సంబంధించి మొత్తం మీద అమెరికా వైఖరిని భారత ప్రభుత్వం స్పష్టంగా నిర్ధారించలేదన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి.
ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్న దేశాల గురించి అమెరికన్ నేతలు తరచూ ప్రస్తావిస్తున్నా.. ఉభయ దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను వారు విస్మరించడం లేదు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, భారత ప్రధాని మోడీ రానున్న అయిదు నెలల్లో కనీసం నాలుగు సార్లయినా సమావేశమయ్యే అవకాశాలున్నాయి.
విశ్వాసపాత్రులైన భాగస్వాముల్లా వీరు పలు నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే అమెరికా విదేశాంగ శాఖ కొన్ని అంశాలను మాత్రంతన నివేదికలో స్పష్టంగా ప్రస్తావించింది. ఇండియాలో చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద మానవహక్కుల కార్యకర్తలను, జర్నలిస్టులను అరెస్టు చేస్తున్నారని పేర్కొంది. కశ్మీర్ లో మానవ హక్కుల కార్యకర్త ఖుర్రమ్ పర్వేజ్ నిర్బంధాన్ని ఎన్ఐఏ స్పెషల్ కోర్టు కనీసం 5 సార్లు పొడిగించిందని, పౌరసత్వ సవరణ చట్టాన్ని విమర్శించినందుకు ఉమర్ ఖాలిద్ అనే మరో హ్యూమన్ యాక్టివిస్ట్ ను అరెస్టు చేశారని వెల్లడించింది. ఎల్గార్ పరిషద్ భీమా కోరెగావ్ కి సంబంధించి జరిగిన కుట్ర కోణాలను గుర్తు చేసింది. అయితే ఈ అంశాలపై భారత ప్రభుత్వం స్పందించలేదు.