ఇండియాతో.. ముఖ్యంగా భారత సైన్యంతో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని, ఇవి నిరంతరం కొనసాగుతాయని అమెరికా ప్రకటించింది. ఉభయదేశాల మధ్య మంచి భాగస్వామ్యం ఉందని, ఇండియన్ మిలిటరీతో ఇదివరకటికన్నా ఇప్పుడు మరింత వ్యూహాత్మకంగా సంబంధాలను కొనసాగిస్తామని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ పాట్ రైడర్ తెలిపారు. 1997 లో భారత-అమెరికా దేశాల మధ్య రక్షణ ఒప్పందం కుదిరిందని, కానీ అది దాదాపు ‘కాలం చెల్లిందని ‘, ప్రస్తుతం 20 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఒప్పంద లావాదేవీలు అమలులో ఉన్నాయని ఆయన చెప్పారు.
మా దేశం నుంచి ఇండియా భద్రతా పరమైన సాయాన్ని కోరుతోంది. ఇందుకు మేము ఎప్పుడూ సిద్ధం.. రష్యా నుంచి ఇండియాను దూరం చేసి.. భారత ప్రభుత్వం నుంచి అందే ఏ అభ్యర్థనపైనా స్పందించేందుకు రెడీగా ఉన్నాం అని ఆయన గతనెలలో కూడా ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు.
అయితే రష్యా నుంచి ఎస్-400 మిసైల్ సిస్టమ్స్ ని కొనుగోలు చేయాలన్న భారత యోచనపై అమెరికన్ అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. ఇక- తన వైమానిక పాటవాన్ని పెంపొందించుకునేందుకు ఇండియా .. రష్యా నుంచి 5 యూనిట్ల ఎస్-400 ట్రియంఫ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ ని కొనుగోలు చేసేందుకు 2018 అక్టోబరులోనే ఒప్పందం కుదుర్చుకుంది. ఇది 5 బిలియన్ డాలర్ల విలువైనది
. నాడు అమెరికాలో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ ఇండియా .. ఈ డీల్ పై సంతకం చేసింది. ఫలితంగా ఆంక్షలు విధించే అవకాశాన్ని కూడా నాడు ట్రంప్ ప్రభుత్వం పరిశీలించింది. నిజానికి ఉక్రెయిన్ పై రష్యా వార్ నేపథ్యంలో రష్యా నుంచి భారత దేశం ఆయిల్ ని కొనుగోలు చేస్తున్న వైనంపైనా అమెరికా గుర్రుగా ఉంది. కానీ అమెరికా పరోక్ష హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఇండియా తన కొనుగోలు లావాదేవీలను కొనసాగిస్తూనే ఉంది.