మన పెరట్లో ఎన్నో రకాల పూల మొక్కలను పెంచుతూ ఉంటాం. వాటిలో ముఖ్యంగా 5 రెక్కల నందివర్ధనం కూడా ఒకటి. ఇది పూలు పూయడమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది. దీని పూలు తెల్లగా అందంగా ఉంటాయి. దైవరాధనకే కాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా నయం చేయడంలో నందివర్ధనం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ మొక్క సంవత్సరం పొడవునా పూలను పూస్తుంది. చాలా కాలం నుంచి ఆయుర్వేదంలో నందివర్ధనం మొక్కను ఉపయోగించి అనేక రకాల వ్యాధులను నయం చేస్తున్నారు. ఈ మొక్క పువ్వులకు కంటి అలసటను తగ్గించి నరాలకు బలానిచ్చే శక్తి ఉంది. రెండు పూలను తీసుకుని నీళ్లలో ముంచి కళ్లపై ఉంచుకుంటే కంటి అలసట తగ్గుతుంది. ప్రస్తుత కాలంలో కంప్యూటర్ల మీద పని చేసే వారే ఎక్కువగా ఉన్నారు. దీని వలన కంటి నరాలు దెబ్బ తినడమే కాకుండా దృష్టి లోపాలు కూడా వస్తున్నాయి. ఈ విధంగా నందివర్ధనం పువ్వులను కళ్లపై పావు గంట పాటు ఉంచుకుంటే కంటి అలసటతో పాటు మంటలు, కళ్లు ఎర్రగా మారడం, నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పీ తగ్గుతుంది.
వయసు పైబడిన వారు ఇలా తరచూ చేయడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. పిల్లల్లో వచ్చే దృష్టి లోపాలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా 4 గంటల సేపు ఈ పూలను నానబెట్టి ఆ నీటితో కళ్లను కడుక్కోవడం వల్ల కూడా కంటి సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది.
ఈ పూలను చెట్టు నుంచి కోసినప్పుడు పాలు వస్తాయి. ఆ పాలను గాయాలు, పుండ్ల మీద రాయడం వల్ల అవి త్వరగా మానుతాయి. అంతేకాకుండా పువ్వులను నూరి ఆ ముద్దను గాయాలపై, పుండ్లపై రాసినా కూడా త్వరగా మానుతాయి. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆధ్యాత్మికంగానూ, ఔషధంగానూ పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.