సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం గుర్రంపోడుతండాలో ఇటీవల టీఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడిన మూడవథ్ శీను కుటుంబ సభ్యులను ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. టీఆర్‌ఎస్ నాయకుల భూకబ్జాలకు అడ్డుకుంటున్నారని, అమాయక గిరిజనులపై స్థానిక ఎంపీపీ దాడి చేశారని ఉత్తమ్ మండిపడ్డారు.
ఎంపీపీ స్వయంగా దాడి చేసి పది రోజులు అవుతున్నా ఇప్పటి వరకు నిందితులపై పోలీసులు ఎలాంటి కేసులు రిజిస్టర్ చేయలేదని ఉత్తమ్ విమర్శించారు. రాష్ట్రంలో ఎస్ఐ, సీఐ, డీఎస్పిలు స్థానిక ఎమ్మెల్యేలకు లక్షల లంచం ఇచ్చి పోస్టులు తీసుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయిందని, అధికార పక్షానికి అండగా ఉన్న మట్టంపల్లి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.