ఆర్టీసీ ఎమ్డీ శర్మ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ పై కాంగ్రెస్ మండిపడుతోంది. సునీల్ శర్మ ఏ ఆధారాలతో ఈ అఫిడవిట్ దాఖలు చేశారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. నిజంగా ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ తీవ్ర ఆరోపణలపై హైకోర్టు విచారణ చేయించాలని కోరారు. ఐ.ఎ.ఎస్ అధికారియైన సునీల్ శర్మ చేసిన అవాస్తవ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు. సునీల్ శర్మ ఐ.ఎ.ఎస్ అధికారిగా కాకుండా…రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఇంతకీ ఆర్టీసీ ఎమ్డీ సునీల్ శర్మ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఏముంది? ఆర్టీసీ ఎమ్డీ సునీల్ శర్మ శనివారం హైకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభుత్వాన్ని కూల్చడానికి విపక్షాలు చేస్తున్న కుట్రగా పేర్కొన్నారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి ప్రతిపక్షాలు ఆర్టీసీ కార్మికులను ఉపయోగించుకుంటున్నాయని తెలిపారు. హైకోర్టు వెంటనే ఈ సమ్మెను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు.
తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు 44 రోజులుగా సమ్మె చేస్తున్నా…వారిని చర్చలకు పిలవకుండా జటిలం చేస్తూ పైగా ఇది ప్రతిపక్షాల కుట్ర అని ఆరోపించడం ఏంటని పలువురు రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు రాష్ట్రంలో ప్రతిపక్షం లేదంటూనే మరో వైపు ప్రతిపక్షాల కుట్ర అని అనడంలో అర్ధంలో ఉందా అని అడుగుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను డీల్ చేయడంలో విఫలం చెందిన ప్రభుత్వం సమస్యకు ప్రతిపక్షాలు కారణమని సాకు చూపుతుందని అంటున్నారు. అదే నిజమైతే ఆధారాలు బయటపెట్టాలంటుంది.