ఒకపక్క ఆర్ టి సీ సమ్మె, మరో పక్క డెంగీ బారినపడి అల్లాడుతున్న జనం…
ప్రజల్లో రోజు రోజుకి ప్రభుత్వం మీద తగ్గుతున్న నమ్మకాన్ని హుజుర్ నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఎందుకు క్యాష్ చేసుకోలేకపోయింది? అసలు హుజుర్ నగర్ కి ఉపఎన్నికలు రావడం వెనుక ఉత్తమ్ లోపాయకారి ఒప్పందాలే కారణమా? వరస ఓటములుకు బాధ్యుడిని చేసి ఉత్తమ్ ని పక్కన కూర్చోపెట్టనున్నారా?
కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ ఉత్తమ్ ను ఆ పదవి నుండి తొలగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను గమనించే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ఇక ఈ పదవిలో కొనసాగను అని చెబుతున్నారని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఉత్తమ్ బెంగళూరులో సొంత పనుల్లో బిజీగా ఉన్నారు. అటు నుండి ఢిల్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంది. వెంటనే పీసీసీ మార్పు ఉండే అవకాశం ఉంది.
ఉత్తమ్ పై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఘోర ఓటమి, సిఎల్పీ విలీనం – వీటంతటికి ప్రధాన కారణం ఉత్తమ్ అని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. సిఎల్పీ విలీనంలో ఉత్తమ్ పాత్ర ఉందని కాంగ్రెస్ సీనియర్ లీడర్లు రాహుల్ గాంధీకి ఎప్పుడో ఫిర్యాదు చేశారు. అధిష్టానం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. అసలు ఉత్తమ్ రాజీనామా చేయకుండా ఉంటే ఉపఎన్నికలో ఓటమి, సిఎల్పీ విలీనం జరిగేవి కావని ఇదో పెద్ద కుట్ర అని కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. మై హోమ్ తో ఉత్తమ్ కు ఉన్న మైత్రి సంబంధాలు కాంగ్రెస్ బలహీన పడడానికి ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తమ్ కు ఉద్వాసన తప్పేలా లేదు. అధిష్టానం ఎప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది అన్నది మాత్రమే మిగిలి ఉంది.
ఉత్తమ్ ను తొలగించిన తరువాత పీసీసీ అధ్యక్షుడు ఎవరు అనే చర్చ మొదలైంది. అధిష్టానం కూడా ప్రజలను ఆకర్షించే నాయకుడిని పీసీసీగా నియమించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు రేవంత్ రెడ్డి. కెసిఆర్ ను డీకొట్టలంటే, కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలంటే రేవంత్ రెడ్డి అయితేనే కరెక్ట్ అని అధిష్టానం కూడా భావిస్తున్నట్టు సమాచారం. అటు కర్ణాటకలో డికే శివకుమార్, ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి పేర్లు ఏ క్షణంలో అయినా ప్రకటించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.