సొంత నియోజకవర్గంలో ఉత్తమ్ ఘోర ఓటమి.
పిసిసి హోదాలో ఊహించని ఓటమి.
ఇంటా, బయట విమర్శల వెల్లువ
పిసిసి పదవికి రాజీనామా చేయాలంటున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి కాంగ్రెస్ పార్టీని తల దించుకునేలా చేసింది. పిసిసి అధ్యక్షుడి హోదాలో, తన భార్యను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిపించుకోలేక పోయారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. అసలు పిసిసి అధ్యకుడి పదవికి ఉత్తమ్ వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఓటమిని ఊహించినప్పటికి, మరీ ఇంత ఘోర పరాజయం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది.
2018 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడే ఉత్తమ్ రాజీనామా చేయాలనే డిమాండ్ లు వినిపించాయి. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయాన్ని కాంగ్రెస్ లీడర్స్ గుర్తు చేస్తున్నారు. ఉత్తమ్, టీఆరెఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అందుకే కాంగ్రెస్ కు ఈ గతి పట్టిందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ముందు నుండి ఉత్తమ్ పనితీరు పై కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి ఉంది.అది హుజూర్ నగర్ ఫలితాల తరువాత మరింత ఎక్కువైంది. అసలు హుజూర్ నగర్ ఉప ఎన్నిక రావడానికి ప్రధాన కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డి అని, ఉత్తమ్ ను హుజూర్ నగర్ ప్రజలు ఎన్నుకున్న తరువాత, రాజీనామా చేసి ఎంపిగా పోటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ తొలి వెలుగుతో అన్నారు. సిఎల్పీ, టీఆరెఎస్ లో విలీనం కావడానికి ప్రధాన కారణం ఉత్తమ్ అన్నారు.ఇలా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉత్తమ్ పని తీరుపై అసంతృప్తి తో ఉన్నారు.
కాంగ్రెస్ అధిష్టానం కూడా పిసిసి పదవి నుండి ఉత్తమ్ ను తొలగించాలని ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. అంతకంటే ముందే ఉత్తమ్ రాజీనామా చేస్తే గౌరవంగా ఉంటుందని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు.