తెలంగాణలో 5వ విడతల పల్లెప్రగతి, పట్టణ ప్రగతికి ముందే పాత బిల్లులు విడుదల చేయాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గ్రామ పంచాయతీలలో ఐదో విడత పల్లె ప్రగతి నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం సన్నద్ధమవుతుండడంతో సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. బిల్లలు రాకపోవడం వల్ల గ్రామ పంచాయితీలు, ఆయా పనులు నిర్వహించిన ఎంతో మంది కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు. వేతనాలు చెల్లించలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. పంచాయతీలపై వేతనభారం పడకుండా చూడాలని సీఎంను కోరారు. గ్రామాల్లో సిబ్బంది జీతాలు, డీజిల్ బిల్లులు, కరెంట్ బిల్లులు, ట్రాక్టర్ నిర్వహణకు సైతం చెల్లించే పరిస్థితి పంచాయతీల్లో లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రభుత్వం చెప్పిన పనులను చేసిన వాటికి బిల్లులు చెల్లించడంలో తీవ్ర కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. దీంతో గ్రామ సర్పంచ్ లు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని లేఖలో వివరించారు.
పల్లె ప్రగతి పనుల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. మండల పరిషత్ లో పని చేసే బోర్ మెకానిక్ లు, కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాల చెల్లింపునకు కూడా గ్రామ పంచాయతీలకు నిధులు లేవని పేర్కొన్నారు. వెంటనే పంచాయితీలలో పెండింగ్ లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.