గ్రేటర్ ఎన్నికల్లో ఘోర వైఫల్యం కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా కుంగదీసింది. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయన్న ఆయన.. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు అధిష్టానానికి తన రాజీనామా లేఖను పంపారు. పీసీసీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని లేఖలో కోరారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఘోర ఓటమికి నైతిక బాధ్యతగా ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దుబ్బాక ఫలితాల సమయంలోనే ఉత్తమ్ రాజీనామాకు పార్టీ శ్రేణుల్లో కొందరు డిమాండ్ చేశారు. అప్పటి నుంచి ఆయన దాదాపుగా యాక్టీవ్‌గా కూడా లేరు. గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఉన్నామా లేదా అన్నట్టుగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో గ్రేటర్ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే కాంగ్రెస్ పరిమితం కావడంతో.. ఆయన స్వయంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.