రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర చేస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఒకరిద్దరు పార్టీ సీనియర్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం రావిరాలలో రేవంత్ పాదయాత్ర ముగింపు సభ ఉన్న నేపథ్యంలో కొందరు సీనియర్లతో ఉత్తమ్ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. పాదయాత్రకు అధిష్టానం అనుమతి లేదని, ఎవరి నియోజకవర్గంలో వారికి మాత్రమే అనుమతి ఉందని ఉత్తమ్ ఆ నేతలతో వ్యాఖ్యానించారు.
రేవంత్ పాదయాత్ర ముగింపు సభకు వెళ్లకూడదని ఉత్తమ్, పార్టీ సీనియర్లు ఇతర నేతలను కోరుతున్నారని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. రేవంత్ రెడ్డి పాదయాత్ర పై ముందునుంది అసంతృప్తి గా ఉన్న పిసిసి చీఫ్ ఉత్తమ్, పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ను కూడా సభకు హాజరు కావొద్దని ఒత్తిడి తెస్తున్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డి సభ సక్సెస్ కాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తూనే… రేవంత్ రెడ్డి ఒంటరి అని చూపే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు ఓ ప్రచార సారాంశం.
అయితే, పార్టీలోని కొందరు సీనియర్ నేతలు, నాయకులు మాత్రం రేవంత్ సభకు వెళ్లి తీరాలని, కాంగ్రెస్ జెండా పట్టుకొని నాయకుడిగా ముందు నడిచిన రేవంత్ కు అండగా ఉండాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు. కొంత మంది నేతలు మినహా దాదాపుగా అందరూ సీనియర్లు ట్రాక్టర్ ర్యాలీ, సభకు హాజరవుతున్నారు. జిల్లాల నుంచి పెద్దఎత్తున ట్రాక్టర్లు ఇప్పటికే హైదరాబాద్ బయల్దేరాయి. ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా సభకు హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది.