అంతా అనుకున్నట్లే… ఎట్టకేలకు ఉత్తమ్ తన కుర్చీ విడిచేందుకు సిద్ధమయ్యారు. పీసీసీ అధ్యక్షునిగా ఫెయిల్యూర్ మార్కులు సంపాదించుకున్న ఉత్తమ్, తన సొంతగడ్డ హుజూర్‌నగర్ ఓటమి తర్వాత తాను ఇక కొనసాగలేనని ఏఐసీసీ పెద్దలకు రాజీనామా పత్రాన్ని అందించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక… కాంగ్రెస్‌లో గ్రూపుల పంచాయితీ మరింత ముదిరినా, పార్టీ ఆయన్ను తప్పించలేదు. రాష్ట్రంలో మల్లన్నసాగర్ ఉద్యమం, భూసేకరణ అంశాలపై ప్రతిపక్ష పార్టీగా ఉత్తమ్ పెద్దగా స్పందించలేదని…. ఎన్నో విమర్శలు వచ్చినా కేంద్ర నాయకత్వం ఉత్తమ్‌కు బాసటగా నిలిచింది. ప్రాజెక్టుల రీడిజైనింగ్, భగీరథ ప్రాజెక్టు సహా చాలా అంశాల్లో భారీ అవినీతి ఉందని నామమాత్రపు విమర్శలు చేశారు కానీ… ప్రభుత్వంపై ఫైట్ చేయటంలో విఫలమైనా ఏఐసీసీ అవకాశం ఇస్తూనే వచ్చింది. చివరకు ఉత్తమ్ సొంత జిల్లా నేతలు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సైతం ఉత్తమ్ వద్దనుకున్నారు. కానీ అనూహ్యంగా… 2018లోనే ముందస్తు ఎన్నికలకు వచ్చారు సీఎం కేసీఆర్. ఓ రకంగా ముందస్తు ఎన్నికలను పసిగట్టి, పార్టీని… శ్రేణుల్ని సరైన దిశలో నడిపించే బాధ్యత ఉత్తమ్‌పైనే ఉన్నా… ఉత్తమ్ మార్క్ రాజకీయాలతో… పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇక ఉత్తమ్ శకం ముగిసింది అని అంతా అనుకున్నా… ఉత్తమ్ కుర్చీని విడిచిపెట్టలేదన్న వాదనలు వినిపించాయి.
ఎంపీ ఎన్నికల్లోనూ పార్టీ మరింత దిగజారింది. రాష్ట్రంలో ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానం ఉన్న బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు సాధిస్తే… కాంగ్రెస్ కేవలం 3సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యతగా రాహుల్‌గాంధీ రాజీనామా చేశారు కానీ ఉత్తమ్ పేరుకు కూడా రాజీనామా లేఖ రాయలేకపోయారు. చివరకు హుజూర్‌నగర్ ఓటమితో ఉత్తమ్‌కు రాజీనామా చేయక తప్పలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే… వెంటనే ఢిల్లీ వెళ్లి, రాజీనామా లేఖ అందించారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున…. అప్పటి వరకు కొనసాగమని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది.
ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ నామమాత్రం అవ్వటంలో… ఉత్తమ్ ఉదాసీన వైఖరే కారణమని కొందరు, ఉత్తమ్‌కు కేసీఆర్‌తో ఉన్న లోపాయకారి ఒప్పందం కారణమని కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహిత వర్గాలతో… ఉత్తమ్‌కు మంచి అండర్‌స్టాండింగ్ ఉందన్న వాదన కూడా పార్టీలో అంతర్గతంగా జోరుగా వినిపిస్తుంది.
ఉత్తమ్ రాజీనామాతో… ఇప్పుడు కాంగ్రెస్‌లో కుర్చీల కొట్లాట మళ్లీ మొదలైంది. ఈసారైనా కాంగ్రెస్ పెద్దలు పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తారా… లేక ఎప్పట్లాగే కుల పంచాయితీలతో మరో ఉత్తమ్‌ను తీసుకొస్తారో చూడాలి.