తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉంటాయని ముందునుంచి కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పదే పదే చెబుతూ వస్తున్నారు. తాజాగా మరోసారి ఆయన అవే కామెంట్స్ చేశారు. తెలంగాణలో ముందస్తు పక్కా అని చెప్పారు. అంతేకాదు, రాష్ట్రపతి పాలన కూడా విధిస్తారని జోస్యం చెప్పారు.
రాష్ట్రపతి పాలనకు రాష్ట్ర ప్రజలకు సిద్ధంగా ఉండాలని సూచించారు ఉత్తమ్. ఈ నెలాఖరున శాసనసభ రద్దు కావడం ఖాయమన్నారు. కేసీఆర్ కచ్చితంగా అసెంబ్లీని రద్దు చేసే ఉద్దేశంలోనే ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈసారి కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. అలాగే, తాను కూడా భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి పోటీ చేసిన ఉత్తమ్ విజయం సాధించారు. ఆ సమయంలో ఆయన భార్య పద్మావతి కోదాడ నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. 2019 ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుండి ఉత్తమ్ గెలుపొందారు. దీంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత ఉప ఎన్నికల్లో పద్మావతిని బరిలోకి దింపినా ఓటమి తప్పలేదు.
అయితే.. వచ్చే ఎన్నికల్లో తాను 50 వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నానని జోస్యం చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒకవేళ 50 వేల మెజార్టీ రాకపోతే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని స్పష్టం చేశారు.