ఉత్తరాఖండ్ హిమపాతంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. తాజాగా మృతుల సంఖ్య 26కు చేరుకుంది. శుక్రవారం మరో పది మృతదేహాలను రెస్క్యూ బృందాలు వెలికితీశాయి.
ఈ మేరకు విషయాన్ని నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ సంస్థ వెల్లడించింది. ఇంకా మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి వుందని పేర్కొంది.
మృతుల్లో 24 మంది పర్వతారోహణలో శిక్షణ పొందుతున్నారు. మరో ఇద్దరు వారందరికి శిక్షణ ఇస్తున్నారు. వారంతా ద్రౌపదీ కా డాండా-2 పర్వత శిఖరం అధిరోహించి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది.
శిక్షణ పొందుతున్న వారిలో బెంగాల్, ఢిల్లీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, అసోం, హర్యానా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. మృత దేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.