ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ లో గల అతి పెద్ద ‘గఫూర్ బస్తీ’ ఇక ‘నేలమట్టం’ కానుందా ? ఇక్కడి 400 కుటుంబాలు రోడ్డున పడనున్నాయా ? సుమారు 4 వేలకు పైగా ఇళ్ళు, 11 స్కూళ్ళు ఓ బ్యాంక్, 10 మసీదులు, ఆలయాలు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు, ఇంకా షాపులు, చిన్నా చితకా కట్టడాలు త్వరలో కూలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం 29 ఎకరాల ఈ భూమి తమదేనని రైల్వే శాఖ కోర్టుకెక్కడమే.. ఈ విశాల స్థలంలోని స్థానికులంతా అక్రమంగా ఇళ్ళు నిర్మించుకున్నారని, వాళ్ళను ఖాళీ చేయించాలని రైల్వే శాఖ ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీంతో జనవరి 8 లేదా 9 లోగా ఈ బస్తీవాసులంతా దీన్ని వెకేట్ చేయాల్సిందేనని కోర్టు ఆదేశించింది. అయితే ఇన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్న తామెక్కడికి పోవాలంటూ వీరంతా భారీ నిరసనలు చేబట్టారు. ధర్నాలు చేశారు.. కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టుకెక్కారు. ఈ పిటిషన్ ని అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారించనుంది. బుధవారం ఈ బస్తీలోని మసీదుల్లో పెద్ద సంఖ్యలో ముస్లిములు ప్రార్థనలు చేశారు. సుప్రీంకోర్టు కూడా తమకు ప్రతికూలంగా తీర్పునిస్తే ఏం చేయాలని బస్తీవాసుల్లో చాలామంది విలపించారు.
కోర్టు తీర్పు ఎలా ఉన్నా హల్ద్వానీ లో అప్పుడే భారీ ఎత్తున పోలీసు, పారా మిలిటరీ బలగాలను మోహరించారు. ఇన్ని కట్టడాల కూల్చివేతకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మెగా కూల్చివేతలకు అవసరమైన హంగులనన్నీ అధికారులు సిద్ధం చేశారు.
ఈ బస్తీ వాసుల్లో చాలామంది ముస్లిములు అయినందున బీజేపీ ప్రభుత్వం ఇలా కక్షపూరిత చర్య తీసుకుంటున్నదని ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత హరీష్ రావత్ ఆరోపించారు. ఈ స్థానికుల్లో పలువురు మహిళలు, పిల్లలు, గర్భిణులు, వృద్దులు ఉన్నారని, వారి ఇళ్లను కూల్చివేస్తే వారంతా రోడ్డున పడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఈ రాష్ట్రానికి గార్డియన్ అని, బహుశా ఆయన వీరిని ఆదుకోవచ్చునని చెప్పిన హరీష్ రావత్.. తన ఒక గంట మౌన దీక్షను ఆయనకు ‘అంకితం’ చేస్తున్నానని పేర్కొన్నారు.