ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతి పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర విచారాన్ని తెలియజేశారు. వేణుమాధవ్ తెలంగాణ గర్వించదగ్గ హాస్య నటుడు అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి కొనియాడారు. వేణుమాధవ్ మరణం సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మంచి కమెడియన్‌ను కోల్పోయిందని రేవంత్ బాధపడ్డారు. వేణుమాధవ్ తెలుగు ప్రజలు గర్వించదగ్గ హాస్య నటుడిగా పేరు ప్రఖ్యాతులు పొందారని కొనియాడారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియచేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వేణుమాధవ్ మృతికి సంతాపం ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి వేణుమాధవ్ చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. అన్నగారి అభిమానాన్ని పొందిన నటుడని శ్లాఘించారు.
తెలంగాణ సీయం కేసీఆర్ మరో ప్రకటనలో వేణుమాధవ్ మృతికి సంతాపం ప్రకటించారు.
యువ కథానాయకులు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నితిన్ వేణు మాధవ్ మృతికి తమ సంతాపాన్ని తెలియజేశారు. వేణుమాధవ్‌తో సన్నిహితంగా ఉండే కమెడియన్లు అలీ, ఉత్తేజ్ ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచే వేణు మాధవ్ లేడంటే నమ్మలేకపోతున్నా అంటూ సీనియర్ నటుడు గౌతమ్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.