ఉత్తరప్రదేశ్ లో అమానుష ఘటన జరిగింది. లఖింపుర ఖేరి జిల్లాలో ఓ చెట్టుకు వేలాడుతూ ఇద్దరు అక్కచెల్లెళ్ల మృతదేహాలు కనిపించాయి. ఇద్దరూ దళిత కుటుంబానికి చెందిన మైనర్లేనని పోలీసులు తెలిపారు. కొందరు దుండగులు బైక్ పై వచ్చి తమ కూతుళ్లను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని, వారిపై అత్యాచారం జరిపి హత్య చేశారని వీరి తల్లి ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ బాలికల మృతదేహాలను పోస్ట్ మార్టం కి పంపారు. ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. బాలికలను వారి దూపట్టాతోనే హతమార్చినట్టు తెలుస్తోందని, వారి శరీరాలపై ఎలాంటి గాయాలు కనిపించలేదని ఐజీపీ లక్ష్మీ సింగ్ తెలిపారు. వీరి మృతదేహాలకు నిపుణుల పానెల్ పోస్ట్ మార్టం చేస్తుందని, బాలికల కుటుంబాల ఫిర్యాదు ఆధారంగా దుండగులపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేస్తామని ఆయన చెప్పారు.
గత ఏడాది అక్టోబరులో ఇదే జిల్లాలో ఆందోళన చేస్తున్న రైతులపైనుంచి కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా తన వాహనాన్ని పోనిచ్చాడు. ఆ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే మరణించగా ఆ తరువాత జరిగిన సంఘటనల్లో ఓ జర్నలిస్ట్ సహా మరో ముగ్గురు చనిపోయారు. లఖింపురి ఖేరి జిల్లాలో జరిగిన తాజా ఘటనపై స్పందించిన అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ.. యూపీలో శాంతిభద్రతలు లోపించాయని, సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహిళల రక్షణలో విఫలమైందని ఆరోపించింది.
రాష్ట్రంలో గూండాలు ప్రతిరోజూ తల్లులను, బాలికలను వేధిస్తున్నారని, పోలీసులు చోద్యం చూస్తున్న్నారని ఈ పార్టీ దుయ్యబట్టింది. దళిత కుటుంబానికి చెందిన ఈ అక్కాచెల్లెళ్ల హత్యాచారంపై ప్రభుత్వం వెంటనే దర్యాప్తు జరిపించాలని, నేరస్థులను కఠినంగా శిక్షించాలని సమాజ్ వాదీ పార్టీ డిమాండ్ చేసింది. అమాయక బాలికలను ఎత్తుకుపోయి అత్యాచారం చేసి హతమార్చారని, అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.
పోలీసుల వైఫల్యానికి నిరసనగా తమ పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన తాలూకు ఫోటోలను ఆయన దీనికి జోడించారు. నిఘాసన్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై తమ ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. తమ అంగీకారం లేకుండానే పోస్ట్ మార్టం నిర్వహించారని ఈ బాలికల తండ్రి ఆరోపించారని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది హత్రాస్ జిల్లాలో 19 ఏళ్ళదళిత మహిళపై నలుగురు అత్యాచారానికి పాల్పడగా.. ఆమె చికిత్స పొందుతూ ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో మరణించింది.