టాలీవుడ్ లో బడా సంస్థలన్నీ డబ్బింగ్ సినిమాలపై పడ్డాయి. తెలుగులో పెద్ద సినిమాలు రిలీజ్ కు లేకపోవడం, అదే టైమ్ లో డబ్బింగ్ మూవీలు సక్సెస్ అవుతుండడంతో చాలామంది నిర్మాతలు ఈ దిశగా సినిమాలు పట్టేస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి యూవీ క్రియేషన్స్ కూడా చేరింది.
నయనతార నటించిన కనెక్ట్ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను యూవీ క్రియేషన్స్ సంస్థ తీసుకుంది. ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై నయనతార భర్త విఘ్నేష్ శివన్ నిర్మించాడు. దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇప్పుడీ మూవీని యూవీ సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.
హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ స్పెషలిస్ట్. నయనతార లీడ్ గా ఆయన రూపొందించిన “మయూరి” సినిమా తెలుగులో విజయాన్ని సాధించింది. అలాగే తాప్సీ హీరోయిన్ గా శరవణన్ తెరకెక్కించిన “గేమ్ ఓవర్” కూడా సూపర్ హిట్టయ్యింది. కనెక్ట్ చిత్రాన్ని కూడా ఆయన ఇంతే ఆసక్తి కలిగించేలా రూపొందించినట్లు తెలుస్తోంది.
తెలుగులో ఈమధ్య కాంతార సినిమాను అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. లవ్ టుడే వెనుక దిల్ రాజు ఉన్నారు. సర్దార్ సినిమాను నాగార్జున, అంతకంటే ముందు విక్రమ్ సినిమాను సుధాకర్ రెడ్డి రిలీజ్ చేశారు. ఇలా వీళ్లంతా డబ్బింగ్ సినిమాలతో హిట్లు కొట్టారు. ఇప్పుడిదే కోవలో కనెక్ట్ తో హిట్ కొట్టాలని ఫిక్స్ అయింది యూవీ సంస్థ.