కాంగ్రెస్ నేత వీ హనుమంతరావుకు కోపమొచ్చింది. కేసీఆర్ పక్కనే నిలబడి టీఆర్ఎస్ కండువాతో ఉన్న తన ఫోటోను సోషల్ మీడియాలో ఫార్వార్డ్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పీఎస్ కు వెళ్లిన వీహెచ్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కంప్లయింట్ ఇచ్చే సమయంలో సీఐతో వాగ్వాదం జరిగింది.
తనతోపాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరినట్లు ఫోటోలను మార్ఫ్ చేశారని మండిపడ్డారు వీహెచ్. కాంగ్రెస్ లో కోవర్టులుగా తమకు ముద్ర వేస్తున్నారని సీరియస్ అయ్యారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కలిశారు వీహెచ్. ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు వెళ్లినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో తనకు అవమానం జరిగిందని ఈ సందర్భంగా జగ్గారెడ్డి.. వీహెచ్ కు చెప్పారు.
టీఆర్ఎస్ లో తాను చేరాలనుకుంటే రెండేళ్ల క్రితమే చేరే వాడినని జగ్గారెడ్డి చెప్పినట్లు వీహెచ్ తెలిపారు. ఈ క్రమంలోనే టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ ఎమోషనల్ అవుతూ జగ్గారెడ్డి కాళ్లు పట్టుకొని పార్టీని వీడొద్దని బతిమిలాడారు.
ఇప్పటికే జగ్గారెడ్డికి ఉత్తమ్, భట్టి, ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు, శ్రీనివాసన్ ఫోన్ చేశారు. సోనియా గాంధీ దగ్గరకి వెళ్దాం అని సూచించారు. పాత కాంగ్రెస్ నేతలను బయటకు పంపే కుట్ర జరుగుతోందని వీహెచ్ అభిప్రాయపడ్డారు.