టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో వారసుడు ఓడిపోయాడు. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో ఫెయిల్ అయింది. సంక్రాంతి కానుకగా 14వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, 2 రోజులు గడిచేసరికి పూర్తిగా డల్ అయింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల ముందు ఈ సినిమా తేలిపోయింది.
సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకులంతా థియేటర్లకు పోటెత్తుతున్నారు. అయితే ఇలా పోటెత్తిన జనాలంతా చిరంజీవి లేదా బాలయ్య సినిమా చూడ్డానికి మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రెండు సినిమాలకు టికెట్లు దొరక్కపోతే తప్పనిసరి పరిస్థితుల్లో వారసుడు సినిమాకు వెళ్తున్నారు, లేదంటే ఇంటికెళ్లిపోతున్నారు.
అలా మిగులు ఆడియన్స్ తో వారసుడు సినిమా నడుస్తోంది తప్ప, ఈ సినిమాలో కంటెంట్, ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయడం లేదు. ఇప్పటికే తెలుగులో చూసేసిన చాలా సినిమాల ఛాయలు వారసుడు మూవీలో ఉన్నాయంటూ కంప్లయింట్స్ వినిపిస్తున్నాయి.
కొత్త ఎలిమెంట్, కొత్తదనం ఏదీ లేని ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఫలితంగా సంక్రాంతి రేసులో వారసుడు ఓడిపోయాడు. తమిళ్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎందుకంటే, అక్కడ విజయ్ కు ఫ్యాన్ బేస్ ఎక్కువ, పైగా విజయ్ ఇలాంటి సినిమా చేయడం అక్కడి ఆడియన్స్ కు కొత్త. అందుకే అక్కడ హిట్టయింది, ఇక్కడ ఫ్లాప్ అయింది.