కరోనా టీకాలు కొవిడ్ సోకకుండా అడ్డుకోలేవని, వ్యాధి తీవ్రత పెరగకుండా మాత్రమే చూస్తాయని ఎయిమ్స్ సీనియర్ వైద్యుడు, భారత ప్రజారోగ్య సంఘం అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ కె.రాయ్ వివరించారు. దేశంలో 15 నుండి 18 ఏళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి కరోనా వ్యాక్సిన్ అందించనున్నట్లు ప్రధాని తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు. పిల్లల్లో కొవిడ్ తీవ్రత ప్రస్తుతం తక్కువగానే ఉందని అన్నారు. టీకావల్ల అదనపు ప్రయోజనాలేవీ ఉండవని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
కరోనా సోకకుండా అడ్డుకోవడంలో టీకాలు అంతగా సఫలీకృతం కావడం లేదని ఆయన తెలిపారు. వ్యాధి తీవ్రత, మరణాల ముప్పు పెరగకుండా మాత్రం అవి అద్భుతంగా నిరోధిస్తున్నాయని చెప్పారు. పిల్లల్లో కొవిడ్ తీవ్రత, మరణాలు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో వారికి టీకా అందించాలన్న నిర్ణయం అశాస్త్రీయమని రాయ్ పేర్కొన్నారు.