లిప్ కిస్ తెలుసు, ఫ్రెంచ్ కిస్ తెలుసు, మరి బట్టర్ ఫ్లై కిస్ అంటే ఏంటి? ఇప్పుడీ కొత్త తరహా ముద్దును టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు దర్శకుడు గిరీశాయ. ఇతడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రంగరంగ వైభవంగా. వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సంబంధించి ఈరోజు టైటిల్ రిలీజ్ చేశారు. ఆ టైటిల్ రిలీజ్ వీడియోలో హీరోయిన్ తో బట్టర్ ఫ్లై కిస్ కథాకమామిషు ఏంటో చెప్పించాడు దర్శకుడు.
హీరో పెదవులపై తన చూపుడు వేలు ఉంచి, కళ్లుకళ్లు కలిపి ముద్దు పెట్టే సన్నివేశాల్ని వీడియోలో చూపించారు. సరిగ్గా లిప్ కిస్ పెట్టే టైమ్ కు మధ్య నుంచి సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టు గ్రాఫిక్స్ చూపించి, దాన్నే బట్టర్ ఫ్లై కిస్ అనుకోమన్నాడు దర్శకుడు. చివర్లో హీరోతో మాత్రం ఈ ముద్దు నెక్ట్స్ లెవెల్లో ఉందని చెప్పించారు.
చూపించీ చూపించనట్టు కిస్ ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా కాన్సెప్ట్ మాత్రం బాగుంది. టైటిల్ గా ఆకట్టుకునేలా ఉంది. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టోటల్ వీడియోకు మరింత అందం తీసుకొచ్చింది.
వైష్ణవ్ తేజ్ విషయానికొస్తే.. మనోడు ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఎందుకంటే క్రిష్ డైరక్షన్ లో తీసిన కొండపొలం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అందుకే రంగరంగ వైభవంగా సినిమాతో మరోసారి ఉప్పెన తరహాలో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు ఈ మెగా హీరో. అటు కేతిక కూడా హిట్ కోసం వెయిటింగ్. రొమాంటిక్, లక్ష్య.. ఇలా చేసిన సినిమాలన్నీ పోతున్న వేళ, వైష్ణవ్ సినిమాపై కోటి ఆశలు పెట్టుకుంది ఈ పాప.