ఉప్పెన సినిమాలో చదువురాని చేపలు పట్టే వ్యక్తిగా కనిపించాడు వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత కొండపొలం సినిమాలో బాగా చదువుకున్న వ్యక్తిగా కనిపించాడు. సెట్స్ పై ఉన్న మూడో సినిమాలో ఓ మంచి కుటుంబంలోని కుర్రాడిలా కనిపించబోతున్నాడు. ఇప్పుడీ పాత్రలకు భిన్నంగా తన నాలుగో సినిమాను ప్రకటించాడు వైష్ణవ్.
నాలుగో సినిమాలో పూర్తిగా మాస్ ఎలిమెంట్స్ లో కనిపించబోతున్నాడు ఈ హీరో. తాజాగా సినిమా లాంఛ్ అయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ మూవీతో శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఇందులో లుంగీ కట్టి, మీసం మెలితిప్పి, త్రిశూలం పట్టుకొని పక్కా మాస్ గా కనిపిస్తున్నాడు వైష్ణవ్.
పేరుకు ఇది పక్కా మాస్ అయిననప్పటికీ, తన కెరీర్ లో ఇదొక ప్రయోగం అంటున్నాడు వైష్ణవ్ తేజ్. మాస్ అప్పీల్ కోసమో, మాస్ ఇమేజ్ కోసమో ఈ సినిమా చేయడం లేదని.. ఎప్పట్లానే కథ నచ్చి చేస్తున్నానని ప్రకటించాడు.
ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన శ్రీలల హీరోయిన్ గా నటించనుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్(ఫార్యూన్4సినిమాస్) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మూవీకి సంబంధించి మరిన్ని వివరాల్ని త్వరలోనే వెల్లడించనున్నారు.