పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్.ఎన్.రెడ్డి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమా విడుదల తేదీని ప్రారంభోత్సవం రోజునే ప్రకటించారు. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేస్తామన్నారు. అయితే ఆ టైమ్ కు ఇంకా షూటింగ్ పూర్తికాదనే విషయాన్ని గ్రహించారు. అందుకే ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. వేసవి కానుకగా ఏప్రిల్ 29న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
ఈ మేరకు ఓ ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. తీగల కంచె ఆవల అస్పష్టంగా కనిపిస్తూ హీరో నిలుచున్న తీరు, మరో వైపు కంచె తగలబడుతున్న వైనం, ఆసక్తిని రేకెత్తిస్తూ, ఆకట్టుకుంటోంది.
తొలిచిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు వైష్ణవ్ తేజ్. అయితే ఆ తర్వాత అతడు నటించిన సినిమాలేవీ ఆడలేదు. క్రిష్ దర్శకత్వంలో చేసిన కొండపొలం, ఆ తర్వాతొచ్చిన రంగ రంగ వైభవంగా సినిమాలు రెండూ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈ కొత్త సినిమా అతడి కెరీర్ ను, మార్కెట్ ను డిసైడ్ చేసే సినిమాగా మారింది.