పాకిస్తాన్ లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం మొదలైనప్పటి నుంచి భారత్, భారత నేతలపైన ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ దేశ నాయకులు ఇండియా, ఇక్కడి నేతలను ప్రశంసలతో ఆకాశానికి ఎత్తుతున్నారు.
గత వారం ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. భారత్ లో తనకు గొప్ప గౌరవం లభించిందని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇండియా నిస్వార్థ దేశమని, భారత విదేశాంగ విధానం చాల అధ్బుతంగా ఉందన్నారు. ఇండియాపై కుట్రలు చేయడానికి ఎవరూ సాహసించరంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. భారత్ నుంచి పాక్ చాలా నేర్చుకోవాలని పరోక్షంగా సూచించారు.
ఇలా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల రెండు మూడు సార్లు భారత్ గురించి ప్రస్తావించారు. ఇక ఇటు ప్రతిపక్ష నేతలు కూడా భారత నేతల గొప్పదనాన్ని కీర్తించారు. వాళ్ల గొప్ప దనాన్ని వివరిస్తూ ఇమ్రాన్ కు బుద్దిచెప్పే ప్రయత్నం చేశారు. భారత నేతల నుంచి ఇమ్రాన్ చాలా నేర్చుకోవాలని సూచించారు.
అవిశ్వాస తీర్మానానికి ఒక్క రోజు ముందు పీఎంఎల్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ ఓ ట్వీట్ చేశారు. భారత్ లో ఇప్పటి వరకు ప్రధాన మంత్రులపై 27 సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని ఆమె అన్నారు. కానీ వారిలో ఎవ్వరూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, నీతితో ఆడుకోలేదన్నారు. ప్రధాని వాజ్ పాయ్ ఒక్క ఓటుతో ఓడిపోయిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అప్పుడు వాజ్ పాయ్ మౌనంగా ఇంటికి వెళ్లిపోయారే తప్పా దేశాన్ని, రాజ్యాంగాన్ని తాకట్టుపెట్టలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్లను చూసి నేర్చుకోవాలని ఇమ్రాన్ కు ఆమె సూచించారు.