ప్రపంచమంతా ప్రేమికుల రోజును ఘనంగా జరుపుకుంటుంది. పార్కులు, థియేటర్లు, ఐస్ క్రీమ్ పార్లర్లు ప్రేమికులతో సందడిగా కనిపిస్తున్నాయి. కాగా హైదరాబాద్ లో మాత్రం ఆ కలే కనిపించడం లేదు. హిందుత్వ సంఘాలు బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ , ఏబీవీపీల ముందస్తు హెచ్చరికలతో ప్రేమికులు పార్కులవైపు మొహం చాటేశారు. విదేశీ సంస్కృతిని భారతదేశంలో విస్తరించడానికి ప్రయత్నిస్తే సహించేది లేదంటూ రెండు, మూడు రోజులుగా హెచ్చరికలు జరీ చేస్తూనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రేమికులు జంటగా తిరిగి లేనిపోని ఇబ్బందులను కొని తెచ్చుకునే కన్నా ఇంట్లోనే ఉండి వాలెంటైన్ డే ను సెలబ్రేట్ చేసుకోవడం మంచిదని ఆన్ లైన్ లోనే ప్రేమికులు మునిగిపోయారు. చాటింగ్ , వీడియో కాలింగ్ తోనే ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా వాలెంటైన్ డే ప్రత్యేకత కనిపించడం లేదు. సాధారణ రోజుల్లో కనిపించే లాగా కూడా పార్కుల్లో ప్రేమికులు కనిపించకపోవడం గమనార్హం.
గత సంవత్సరం హిందుత్వ సంఘాలు జంట కనిపించిన చోటల్లా వివాహం చేస్తామని ప్రకటించినట్టుగానే చేశాయి. పలు చోట్ల ప్రియుడితో ప్రియురాలికి తాళి కట్టించారు. సాంప్రదాయాలకు విలువనిచ్చే భారతదేశంలో విదేశీ సంస్కృతిని వ్యాప్తి చెందించడం సమంజసం కాదని తెలిపారు. భారతదేశ సంప్రదాయాలను ప్రపంచ దేశాలు కీర్తిస్తుండగా… ఇక్కడి భారతీయులు మాత్రం విదేశీ కల్చర్ మోజులో పడి దేశ సంప్రదాయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు కొంతమంది లవర్స్ కు మద్దతుగా ఉంటామని ప్రకటనలు ఇచ్చారు. ప్రేమికులకు మద్దతుగా పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఓయూ విద్యార్థులు కొంతమంది లవర్స్ ఏమాత్రం భయపడకుండా ప్రేమికుల దినాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చ్చారు.అయినప్పటికీ ప్రేమికులు మాత్రం పార్కుల వైపు వెళ్లే సాహసం చేయలేకపోయారు.