నటీనటులు: అజిత్, కార్తికేయ, హుమా ఖురేషి తదితరులు
మ్యూజిక్ : యువన్ శంకర్ రాజ, గిబ్రాన్
కెమెరామెన్: నిరావ్ షా
ఎడిటింగ్: విజయ్ వేలుకుట్టి
నిర్మాణం: బే వ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్
నిర్మాత: బోణీ కపూర్
నిడివి: 178 నిమిషాలు
విడుదల: 24 ఫిబ్రవరి 2022
రేటింగ్: 2/5
డైలీ సీరియల్స్ కు సంబంధించి ఓ నానుడి బాగా ఫేమస్. ఓ వారం రోజులు సీరియల్ మిస్సయినా ఏం కాదు, కథ అక్కడే ఉంటుంది. ఎంచక్కా కంటిన్యూ అయిపోవచ్చు అంటుంటారు చాలామంది. ఈరోజు రిలీజైన వలిమై సినిమాకు కూడా ఇదే వర్తిస్తుంది. 3 గంటల నిడివి ఉన్న ఈ సినిమాను చూస్తూ మధ్యలో ఓ అర్థగంట నిద్రపోయినా ఏం కాదు, మళ్లీ కంటిన్యూ అయిపోవచ్చు. ఏదో మిస్సయిన ఫీలింగ్ బొత్తిగా కలగదు. అజిత్ హీరోగా నటించిన వలిమై సినిమా ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.
కథ విషయానికొస్తే.. విశాఖపట్నంలో కొందరు బైక్ రైడర్స్ డ్రగ్స్ మత్తులో డబ్బు కోసం మహిళల మెడలో బంగారం దొంగిలిస్తూ, మర్డర్లు చేస్తుంటారు. ఈ క్రమంలో పోలీస్ డిపార్ట్ మెంట్ పై తీవ్ర ఒత్తిడి రావడంతో అసిస్టెంట్ కమిషనర్ అర్జున్ (అజిత్ కుమార్) ను స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేసి చైన్ స్నాచింగ్స్, మర్డర్స్ చేస్తున్న ముఠా కేసుని అప్పగిస్తారు. అలా కేసుని హ్యాండిల్ చేసే క్రమంలో అర్జున్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు? అసలింతకీ ఈ అరాచకాలకు పాల్పడుతున్న ముఠా వెనుక ఉన్నది ఎవరు? ఆ వ్యక్తిని పట్టుకొనేందుకు అర్జున్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరికి ఈ గ్యాంగ్ ని ఎలా అంతమొందించాడు? అనేది మిగతా కథ.
ఈ కథ ఎంత రొటీన్ గా ఉందో, స్క్రీన్ ప్లే కూడా అంతే రొటీన్ గా ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ ప్లాట్ తో 20 ఏళ్ల కిందటే చాలా సినిమాలు వచ్చేశాయి. కనీసం ఇప్పటి టెక్నాలజీని, స్క్రీన్ ప్లేలో అనుసరిస్తున్న సరికొత్త పోకడల్ని కూడా వలిమైలో వాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. చివరికి క్లైమాక్స్ కూడా అంతే వీక్. హీరో కుటుంబాన్ని విలన్ కట్టిపడేయడం, హీరో వెళ్లి తన ధైర్యసాహసాలతో కుటుంబాన్ని కాపాడుకోవడం. పెద్ద ఎన్టీఆర్ కాలం నుంచి చూస్తున్న ఈ ఫార్ములా సన్నివేశాల్ని వలిమైలో పెట్టాలని దర్శకుడికి ఎందుకు అనిపించిందో ఎంత బుర్ర బద్దలుకొట్టుకున్నా అర్థం కాదు.
ఖైదీ లాంటి బ్రిలియంట్ సినిమా తీసినా దర్శకుడు వినోదేనా ఈ వలిమైని తీసింది అనిపిస్తుంది. అంత పూర్ గా ఉంది స్క్రీన్ ప్లే. సినిమా చూసిన ప్రేక్షకుడికి తలనొప్పి ఒక్కటే తక్కువ. మూస సీన్లు, రొటీన్ స్క్రీన్ ప్లేతో విసుగెత్తించాడు దర్శకుడు. దీనికితోడు ఎడిటింగ్ మన సహనాన్ని పరీక్షిస్తుంది. వచ్చిన సీన్లే మళ్లీ మళ్లీ వచ్చినట్టు అనిపిస్తుంది. (రివ్యూలో మొదటి పారాగ్రాఫ్ ను ఇక్కడ మరోసారి చదువుకోవచ్చు). కథ, కథనం, ఎడిటింగ్ విభాగాల్లో తేలిపోయిన ఈ సినిమా సినిమాటోగ్రఫీ, యాక్షన్ సన్నివేశాల విషయంలో మాత్రం ఫర్వాలేదనిపిస్తుంది. నిరావ్ షా సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఛేజింగ్ సీన్లు, బైక్ ఎపిసోడ్స్ అన్నీ బాగా వచ్చాయి. ప్రతి ప్రేక్షకుడు వీటిని ఎంజాయ్ చేస్తాడు.
పెర్ఫార్మెన్సుల విషయానికొస్తే.. అజిత్ ఎప్పట్లానే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా మెప్పించాడు. కానీ పస లేని సన్నివేశాల్లో అతడు నటిస్తుంటే జాలేస్తుంది. ఇంత సీనియర్ నటుడు, ఇలాంటి సన్నివేశాలున్న కథను ఎలా ఒప్పుకున్నాడు, ఎందుకు ఒప్పుకున్నాడనే ప్రశ్న మనసును తొలిచేస్తుంది. ఇక తెలుగు నుంచి తమిళ్ లో అడుగుపెట్టిన కార్తికేయ, ఈ సినిమాలో విలన్ గా నటించాడు. అజిత్ సినిమా కాబట్టి కళ్లుమూసుకొని ఒప్పుకొని ఉంటాడు కార్తికేయ. ఈ సినిమాతో తనకు తమిళ మార్కెట్ కూడా ఓపెన్ అవుతుందనేది అతడి ఆశ. అయితే వలిమైతో కార్తికేయ ఆశ నెరవేరకపోవచ్చు. కేవలం కండలు చూపించడానికి మాత్రమే కార్తికేయ పనికొచ్చాడు తప్ప, అతడి నుంచి వావ్ అనిపించే సీన్ ఒక్కటి కూడా లేదు.
ఓవరాల్ గా వలిమై సినిమాను ఎడిటింగ్ చేస్తే 2 గంటల్లో ముగించొచ్చు. అది ఎలాగూ మన చేతిలో లేదు కాబట్టి భరించక తప్పదు. నిర్మాత బోనీ కపూర్ కు సౌత్ లో ఇది మంచి బోణీ కాదు.
బాటమ్ లైన్ – వల్లకాదు బాబోయ్!