జి.వల్లీశ్వర్, సంపాదకుడు
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నికై ఏడాది పూర్తి కావస్తోంది. 2005 ఏప్రిల్ 30 నాడు. ఈనాడు న్యూస్ ఎడిటర్ వైయస్సార్ శర్మ ఫోన్ చేశారు. ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డిగారు ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వివిధ పార్టీల నాయకులతో ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నాం. రోజుకో ఇంటర్వ్యూ వేస్తాం. మీరు సీఎం గారితో కూడా ‘ఈనాడు’కి ప్రత్యేకంగా ముఖాముఖి మాట్లాడే ఏర్పాటు చేయగలరా? అని అడిగారు.
శర్మ గారు జర్నలిజం ఒక వృత్తిగా తీసుకుని నిబద్ధతతో పనిచేసే వ్యక్తి. జర్నలిస్టులు కొన్ని విలువలు ప్రమాణాలు పాటించి తీరాలని నమ్మే వాణ్ణి నేను. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి కొలువులో ఆయనకి మీడియా సలహాదారు బాధ్యతలో పనిచేస్తున్నాను.
విలువలున్న, విలువలు లేని జర్నలిస్టులందరితోనూ నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా చిరునవ్వుతో గౌరవం ప్రదర్శిస్తూ పనిచేయాల్సిన ఉద్యోగం నాది. ఇందులోనూ ఒక నిబద్ధత నాకుంది. అది ముఖ్యమంత్రి ప్రతిష్టను కాపాడుకోవడం, పెంచుకోవడం. అందువల్ల ప్రభుత్వ ప్రతిష్ట కూడా కాపాడబడుతుంది. శర్మ గారు చెప్పిన దాని మీద కొద్ది క్షణాలు ఆలోచించాను. ఆయన మళ్లీ ప్రశ్న వేసే లోపున ఒక ఆలోచన తట్టింది.
శర్మ గారు.. మీ ప్లాన్ బాగుంది. అయితే ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ అనేది చాలా సాధారణంగా జరిగేదే కదా? దానికి బదులు నేను మీకు సీఎం గారి ఏడాది పాలన మీద ఆయన చేతే ఒక విశ్లేషణ రాయించి ఇచ్చాననుకోండి. ఎలా ఉంటుంది..? ఆలోచించండి.
ఏమిటి సీఎం గారు రాస్తారా ?
అంత ఆశ్చర్యం ఎందుకు? ఆయన చాలా మంచి తెలుగు రాస్తారు. మీకు అభ్యంతరం లేదంటే నేను సీఎం గారిని ఒప్పిస్తాను. కనీసం ప్రయత్నం చేస్తాను.
అద్భుతం..అలాగే చేయించండి. అదే వేస్తాం…వెరైటీగా ఉంటుంది కదా? అయితే ఈలోపల నేను ఈ లోపల మిగతా రాజకీయ పార్టీల నాయకులు ఇంటర్వ్యూలు తీసుకోమని మా వాళ్ళకి చెపుతాను. అవన్నీ రోజుకో ఇంటర్వ్యూ వంతున వేస్తాం. చివర్లో సీఎం గారి విశ్లేషణ వేస్తాం. మీరు ఆ పని మీద ఉండండి.. అన్నారు.
రెండు మూడు క్షణాలే ఆలోచించాను. ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి గారి ప్రతిష్ఠ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఏది మంచిది? ఈ ఏడాది పాలనపై ప్రతిపక్ష పార్టీల, మిత్ర పక్షాల నాయకులు అందరి ఇంటర్వ్యూలు వచ్చేశాక, సీఎం విశ్లేషణ వ్యాసం రావడం మంచిదా? ముందే రావడం మంచిదా ?
అందరి ఇంటర్వ్యూల తర్వాత సీఎం విశ్లేషణ ఏం రాయగలం? వాళ్లంతా- ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఇంటర్వ్యూల్లో వైఎస్ఆర్ పాలన మీద బురద జల్లుతారు. దాన్ని కడుక్కోవడానికి జవాబులు ఇవ్వటమే సరిపోతుంది. అది విశ్లేషణ కాదు.. కదా? నాన్సెన్స్. ఇది సీఎం ప్రతిష్టను ఎంత మాత్రం పెంచలేదు. మనదే (సీఎం గారి విశ్లేషణే) ముందుగా వచ్చేస్తే…! మనం ( సీఎం) ఏం చెప్పాలనుకుంటే అదే చెబుతాం. దాన్నంతా ఖండించుకుంటూ వాళ్ళేం ఇంటర్వ్యూలు ఇస్తారో ఇచ్చుకుంటారు. సీఎం మనోభావాలైతే ముందు ప్రజల్లోకి వెళ్లి పోతాయి గదా!
శర్మ గారు ఫోన్‌లో పిలుస్తున్నారు.. వల్లీశ్వర్ గారు. మీరేమీ మాట్లాడడం లేదు. ఈ ప్లాన్ ఓకేనా ?
సారీ శర్మ గారు.. కంట్లో నలుసు పడితే ఆగాను.. ఒక చిన్న సవరణ చేస్తే ఎలా ఉంటుంది? ఆలోచించండి. మీ (ఈనాడు) దృష్టిలో ముఖ్యమంత్రి గారు ఎలాంటి వారైనా రాష్ట్రానికి నాయకుడు కదా! ప్రజాస్వామ్యబద్దంగా అధిక శాతం శాసనసభ్యులతో ఎన్నుకోబడిన వ్యక్తి . అలాంటి నాయకుడు స్వయంగా ఆత్మ విశ్లేషణ రాసిస్తే దాన్ని ఇతర పార్టీల నాయకులందరి ఇంటర్వ్యూలు పూర్తయ్యాక చివర్లో వేయటం బాగుంటుందా? మొట్టమొదటి ఆయనది వేస్తే అర్థవంతంగా ఉంటుందేమో.! ఆలోచించండి..”
ఆయన ఆలోచించి.. ఇది కూడా లాజికల్ గా ఉంది. సరే, నాకు ఎప్పుడు పంపించగలరు..? అని అడిగారు.
సీఎం గారికి నేను చెప్పాలి. ఆయన ఒప్పుకోవాలి. ఆయన రాయాలి. కనీసం 4- 5 రోజులు పడుతుంది. కనీసం బుధవారానికి (మే 4) ఇవ్వగలరా ? అప్పుడు మేం గురువారం నుంచి ముఖ్యమంత్రి విశ్లేషణతో ప్రారంభిస్తాం…
ప్రయత్నం చేస్తాను…ఇట్నుంచి నేను.
సరే గురువారం నుంచి సీఎం గారి విశ్లేషణతో మొదలుపెట్టి ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తాం.. అట్నుంచి ఆయన.
అలా కార్యక్రమం ఖరారయింది.
ఆ రాత్రే సమాచార శాఖ కమిషనర్ రమణాచారితో నా ఆలోచన చెప్పాను.
బాగుందన్నా, అలా చేసేయ్… అన్నారు ఆయన ఉత్సాహంగా. మీడియా రిలేషన్స్‌లో ఆయన మహా మేధావి కదా!
మర్నాడు ఉదయం సీఎంతో ఏదో ఒక మీటింగ్ జరిగింది. అది అవగానే నేను ఈ విషయం చెప్పాను.
సర్, ఈనాడు వాళ్లు మీ ఏడాది పాలన మీద అన్ని పార్టీల నాయకులతో ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారు. మనల్ని అడిగారు.. అంటున్నాను. నా వాక్యం పూర్తయ్యే లోపలే సీఎం.. వాళ్లు ఎలాగా నెగెటివ్ ఇంటర్వ్యూ కోసమే చూస్తారు గదా వల్లీశ్వర్.. అంటూ నవ్వారు.
సర్.. అంటూ నా ఆలోచన ఏమిటో వివరించాను. రమణాచారి కూడా నేను చెప్పింది సమర్ధించారు. అంతా విన్నాక, సీఎం “సరే…మరి తయారుచేసి చూపించు.” అన్నారు . వెంటనే శర్మ గారికి ఫోన్ చేసి చెప్పాను. సీఎం గారు విశ్లేషణ రాసివ్వడానికి ఒప్పుకున్నారు. మీకు బుధవారం ఇచ్చేస్తాను.. అన్నాను.
మంగళవారం ఉదయం శర్మ గారు గుర్తు చేశారు.
అప్పటికే ఆయన అడిగి మూడు రోజులు గడిచిపోయాయి. నాకు పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంది. రాయటం అవటం లేదు. ఇక ఆ రాత్రి పట్టుదలగా కూర్చున్నాను.
10 గంటలకు మొదలు పెట్టి రెండున్నర గంటల పాటు కళ్ళు మూసుకొని నా పర్సనల్ అసిస్టెంట్ కామరాజుకి చెప్పుకుంటూ వెళ్లాను. అతను పనిమంతుడు. నేను ఎంత వేగంగా చెబితే అంత వేగంగా డి.టి.పి. చేసేవాడు. రాత్రి 12 గంటలకి పూర్తయింది. తప్పుల్లేకుండా సరిచూసుకొని సీల్డ్ కవర్లో సీఎం ఇంటికి అప్పటికప్పుడే పంపించేశాను. మర్నాడు ఉదయం సీఎం ఖమ్మం వెళ్తున్నారు. ఆయన వెంట డిప్యూటీ కార్యదర్శి లవ్ అగర్వాల్ వెళుతున్నారు. కవర్ రాత్రి పంపించేస్తే సీఎం హెలికాప్టర్ లో చదువుకుంటారు గదా…!
బుధవారం మధ్యాహ్నం శర్మ గారు ఫోన్ చేశారు. రేపే మొదలుపెడదాం. ఇవాళ వచ్చేస్తుంది కదా? అన్నారు.
సీఎం గారు ఇంకా రాస్తున్నారు. ఇవాళ వస్తుందో లేదో చెప్పలేను. రేపయితే ఖాయంగా ఇవ్వగలను.
శర్మగారు అయిష్టంగానే సరే అన్నారు.
బుధవారం రాత్రి సీఎం ఖమ్మం నుంచి రాగానే లవ్ అగర్వాల్ నేను రాసిన సీఎం గారి ఆత్మ విశ్లేషణ నాకు తిరిగి పంపించేశారు. కానీ సీఎం సవరణలు, తుడుపులు ఏమీ లేవు. సంతకం కూడా లేదు. అంటే ఏమైంది? అసలు సీఎం చదివారా ? లవ్ అగర్వాల్‌కి ఆ రాత్రి 10 గంటల ప్రాంతంలో ఫోన్ చేశాను.
బాస్, సీఎం నేను పంపిన కాగితాలు చదివారా ? లేదా? కామెంట్స్ ఏమీ లేవేమిటి ?
సారీ గురూజీ. మీకు నేను చెప్పడం మర్చిపోయాను. హెలికాప్టర్‌లో వెళ్లేటప్పుడే సీఎం మొత్తం చదివేశారు. ‘చాలా బాగుంది..నేను రాసినట్లే ఉంది’ అని మీకు చెప్పమన్నారు.
సారీ..సారీ…అంటున్నారు లవ్. నాకు అవేవీ వినపడటం లేదు.
“నేను రాసినట్లే ఉంది.. నేను రాసినట్లే ఉంది” అన్న మాటలే చెవుల్లో మిగిలిపోయాయి.. ఇప్పటికీ.
గురువారం ఉదయం 11 గంటలకల్లా చిన్న అచ్చు తప్పులు సరి చూసుకొని రెడీ చేసుకున్నాను. వెంటనే పంపించెయ్యాలి కదా.. ‘ఈనాడు’కి పంపబోతుంటే ఇంకో ఆలోచన మెరిసింది.
ఇవాళ గురువారం. ఇవ్వాళ ఈ వ్యాసం ఇస్తే రేపు (శుక్రవారం) ఈనాడులో వేస్తారు. రేపు ఇస్తే శనివారం పేపర్‌లో వస్తుంది. అదే శుక్రవారం రాత్రి బాగా పొద్దు పోయాక ఇస్తే ఆదివారం వస్తుంది. ఆదివారం నాడు ఓ లక్షో.. రెండు లక్షలో ఎక్కువ కాపీలు ప్రింట్ చేస్తారు. అందువల్ల ఎక్కువ మంది చదువుతారు కదా..!
గురువారం 12 గంటలు అయ్యేసరికి ఈనాడు న్యూస్ ఎడిటర్ శర్మ గారు ఫోన్ చేశారు. అయ్యా సీఎం గారి వ్యాసం రెడీ అయిందా? రేపు వేసేయాలి గదా..!
ఆ.. ఆ.. అయిపోయినట్లే.. ఇంకా కొన్ని సవరణలు జరగాల్సి ఉంది. ఇవ్వాళ అవ్వకపోవచ్చు. సీఎం చాలా బిజీగా ఉన్నారు. రేపు సాయంత్రానికి ఖాయంగా వచ్చేలా చూస్తాను… అన్నాను. అబద్ధం చెబుతున్నాను. నాకే నచ్చలేదు. చేతిలో వ్యాసం రెడీగా పెట్టుకొని అబద్ధం చెప్పడం ఎందుకు…? మరి నేను ఇక్కడ ఎందుకు పని చేస్తున్నాను. సీఎం ప్రతిష్ట పెంచడం కోసం.. దట్సాల్ .
శర్మ గారు.. “రేపు ఎలాగైనా వచ్చేలా చూడండి. పేజీలు ప్లాన్ చేసుకోవాలి గదా.. అంటూ ఫోన్ పెట్టేశారు. ఆయన కంఠంలో అసహనం నాకు తెలిసిపోయింది.. కానీ..!
శుక్రవారం పొద్దుటే ఫోన్ చేశాను శర్మగారికి. సీఎం గారి నుంచి ఆ వ్యాసం నా చేతికి ఈ రాత్రికి వస్తుంది. ఎన్ని గంటలకు వస్తుందో తెలీదు. తెల్లవారే లోపల నేను మీకు చేరుస్తా.. అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆయన శనివారం నాడు సీఎం గారి విశ్లేషణతో ఆ ఇంటర్వ్యూలు మొదలు పెట్టాలనుకున్నారు. నేనొక దూ(దు)రాలోచన చేశాను.
శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో శర్మ గారికి ఆ వ్యాసం పంపించేశాను. దాన్ని వాళ్లు శనివారం వేయలేరు. చదువుకోవాలి. డి.టి.పి. చేయాలి. పేజీలో స్థలం ప్లాన్ చేయాలి. ఎంత పని ఉంటుందో నాకు తెలుసు కదా …!
నేను ఆశించినట్లుగా, ఆలోచించినట్లుగా ముఖ్యమంత్రి ఆత్మ విశ్లేషణ వ్యాసం ఆయన పేరుమీద ఆయన సంతకంతో ఆ ఆదివారం (మే 8) ‘ఈనాడు’లో ప్రచురితమైంది. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి పాలకుడు కాబట్టేమో, మొదటి పేజీలోనే ‘గత ఏడాదిగా నాలో మనసంతా మీరే’ అన్న పతాక శీర్షికతో ప్రచురించారు. అది రెండో పేజీ కూడా కొనసాగింది.
కానీ ఒక అపరాధ భావన ఇప్పటికీ నా మనసులో మెదుల్తూంటుంది.
..అప్పుడు శర్మ గారికి రెండు రోజులపాటు అబద్ధం చెప్పాను. అదే ఆ అపరాధభావం!
(నా పుస్తకం ‘వైఎస్సార్ ఛాయలో..’ పుస్తకావిష్కరణ ఈరోజు.. ఈ సందర్భంగా ఆ పుస్తకంలో 4పేజీలు తొలివెలుగు రీడర్స్ కోసం..)