వాల్మీకి రామాయణం రాశాడు.. హరీశ్ శంకర్ వాల్మీకినే కొత్తగా రాశాడు..
ఒక రీమేక్ సినిమాని ఒరిజినల్ కంటే బెస్ట్‌గా, అసలు ఒరిజినల్ మూవీ గుర్తే రాకుండా తీయాలంటే అది హరీశ్ శంకర్‌కే సాధ్యం. దశాబ్ద కాలంగా ఫ్లాప్స్ ఉన్న తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ని గబ్బర్ సింగ్‌గా చూపించి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్, ముందెన్నడూ చూడని పవర్ స్టార్‌ని ప్రేక్షకులకి చూపించాడు. హిట్ కోసం ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టిన హరీశ్ శంకర్, ఇప్పుడు మరో మెగా హీరో వరుణ్ తేజ్‌ని వాల్మీకిగా ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. గబ్బర్ సింగ్ సినిమా సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ మూవీకి రీమేకే అయినా ఎక్కడా ఆ ఛాయలు కనిపించకుండా, ప్రతిదీ కొత్తగా రాసిన హరీశ్ శంకర్ ఇప్పుడు వాల్మీకి సినిమాకి కూడా అదే రూట్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తున్నాడు. మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న వాల్మీకి, తమిళ్ లో సూపర్ హిట్ అయిన జిగర్తాండకి రిమేక్‌గా రాబోతోంది. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిన జిగర్తాండకి హరీశ్ శంకర్ మార్పులు చేర్పులు చేసి మన నేటివిటీకి తగ్గట్లు మార్చినట్లు ఉన్నాడు.
తెలుగులో వరుణ్ తేజ్ చేసిన పాత్రని తమిళ్‌లో బాబీ సింహా చేశాడు, సినిమాకి బ్యాక్ బోన్ లాంటి ఈ పాత్రకి కోలీవుడ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఉండదు కానీ హరీశ్ శంకర్ మాత్రం వాల్మీకి సినిమాలో ఫ్లాష్ బ్యాక్ పెట్టాడు. రీసెంట్‌గా వినాయక చవితి రోజు రిలీజ్ అయిన వాల్మీకి పోస్టర్‌తోనే ఈ విషయంలో హరీశ్ శంకర్ చిన్న హింట్ ఇచ్చాడు. ఇప్పటి వరకూ ప్రతి పోస్టర్‌లో గుబురు గడ్డంతో కనిపించిన వరుణ్, వినాయచవితి నాడు విడుదల చేసిన పోస్టర్‌లో మాత్రం యంగ్ లుక్‌లో కనిపించాడు. పైగా తమిళ్‌లో బాబీ సింహా పాత్రకి లవ్ స్టోరీ లేదు, అది కూడా మర్చి హరీశ్ శంకర్… వరుణ్ తేజ్‌కి లవ్ స్టోరీ పెట్టాడు. వరుణ్, పూజా హెగ్డే కలిసి ఉన్న పోస్టర్ చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది. ఇందులో పూజా పాత్ర పేరు శ్రీధేవి. సైకిల్ తొక్కుతూ, టీవీ యాంటెన్నా పెడుతూ కనిపించింది.
రీసెంట్‌గా వాల్మీకి సినిమా షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టిన హరీశ్, లాస్ట్ రోజు షూటింగ్ స్పాట్ నుంచి ఒక ఫోటోని ట్వీట్ చేశాడు. ఈ ఫొటోలో హరీశ్ శంకర్‌తో పాటు బ్రహ్మానందం కూడా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే వాల్మీకిలో కామెడీ డోస్ కూడా ఎక్కువగానే ఉన్నట్లుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా వాల్మీకి సినిమాలో చిన్న క్యామియో చేస్తుండడం విశేషం. మొత్తానికి వాల్మీకి నుంచి ఇప్పటి వరకూ బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే జిగర్తాండ సినిమాలోని ప్లాట్ పాయింట్‌ని మాత్రమే తీసుకోని హరీశ్ శంకర్ కొత్త వాల్మీకిని తీసినట్లు ఉన్నాడని అనిపించింది. అదే నిజం చేస్తూ చిత్ర యూనిట్, వాల్మీకి ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. గద్దలకొండ గణేష్‌గా గుబురు గడ్డంతో ఉన్న వరుణ్ తేజ్ ఎపిసోడ్ ఊహించిందే అయినా కూడా, మన ప్రేక్షకులకి తగ్గట్లు మార్పులు చేర్పులు చేసిన హరీష్ శంకర్… కాస్త వెనక్కి వెళ్లి 90ల కాలంలో లీడ్ పెయిర్ పైన మంచి లవ్ స్టోరీ సెట్ చేశాడు. హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న వరుణ్ తేజ్‌ని విలన్ పాత్రలో చూపించాలంటే ఆడియన్స్‌ని చాలా కన్విన్స్ చేయాలి, అందుకే వరుణ్ రౌడీగా మారడానికి అవసరమైన ఫ్లాష్ బ్యాక్ ని హరీశ్ శంకర్ డిజైన్ చేశాడు. ట్రైలర్‌లో వచ్చిన వన్ లైనర్స్ బాగున్నాయి. పూజ అండ్ వరుణ్ తేజ్ జంట ఎంత ఫ్రెష్‌గా ఉందో… అథర్వా మురళి, మిర్నలిని జంట కూడా అంతే ఫ్రెష్‌గా ఉంది. రెండేళ్ల తర్వాత వాల్మీకీతో ప్రేక్షకుల ముందుకి రానున్న హరీశ్ శంకర్ మంచి హిట్ ఇచ్చేలానే ఉన్నాడు చూస్తుంటే!