- పేదల భూములు పెద్ద స్వామిజీ పాలు
- అప్పనంగా చినజీయర్ స్వామికి భూములు అప్పగింత
- రూల్స్ అతిక్రమించి స్వామిభక్తి చాటుకున్నవైటీడీఏ అధికారులు
వైటీడీఏ అంటే యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ. ఈ సంస్థ యాదాద్రి దేవస్థానాన్ని అభివృద్ది కోసం కృషి చేస్తుంది. కానీ, జరుగుతున్నది వేరు. వైటీడీఏ అంటే చినజీయర్ స్వామి జేబులో సంస్థగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. చినజీయర్ చెబితే కానీ అక్కడ అంగుళం కూడా కదలదు. గుడిలో ఏ గోడకి ఏ బొమ్మ వుండాలో మార్గదర్శనం చేయడం దగ్గర నుంచి ఏ భూమి ఎక్కడ వుందో.. అది ఎప్పుడు ఎవరికి రిజిస్ట్రేషన్ చేయాలో కూడా వైటీడీఏకి ఆదేశాలిచ్చేదీ ఆ స్వాములోరే.. అని వినిపిస్తోంది!
హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో 2.30 ఎకరాల భూమిని యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటీడీఏ) చినజీయర్ స్వామికి చెందిన ఎడ్యుకేషన్ ట్రస్ట్‌కు రిజిస్ట్రేషన్ చేసింది. 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 2014లో వైటీడీఏ ఏర్పాటు చేసి రూ.1200 కోట్లు కేటాయించారు. ధార్మిక అవసరాల కోసమని వైటీడీఏ యాదాద్రి పరిసర ఆరు గ్రామాల పరిధిలోని దాదాపు 80 సర్వే నంబర్లలో 2028.37 ఎకరాలను సేకరించింది. 2015లో ఇక్కడ ఎకరాకు రూ.3 లక్షలు ఉండగా మూడు రెట్లు ఎక్కువ ఇచ్చి ఎకరం 10.50 లక్షల చొప్పున వైటీడీఏ కొన్నది.
2004లో చినజీయర్ స్వామికి చెందిన జీవా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జీవా)కు అప్పటి ప్రభుత్వం కొంత భూమిని G.O. M.S No. 130 Revenue (Endts. II) తేదీ 6-2-2004 ద్వారా 30 సంవత్సరాలకు లీజుకి ఇచ్చింది. అందులో జీవా రెండంతస్తుల బిల్డింగ్‌ని నిర్మించి వేదిక్ పాఠశాల నిర్వహిస్తుంది. ఆ భూమి లీజుకి ఇచ్చి 15 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకో 15 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది. యాదాద్రి డెవలప్‌మెంట్ కోసం ఆ భూమిని కూడా ప్రభుత్వం సేకరించింది. అయితే ఆగస్టు 14న చినజీయర్ స్వామి దేవాలయ అభివృద్ధి కోసం ‘జీవా’కి సంబంధించిన భూమిని సేకరించినందున ఇంకోచోట తమకు నాలుగు ఎకరాలు కేటాయించమని లెటర్ రాశారు.
త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీకి భూమిని ఈనెల 5న రిజిస్టర్ చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్‌కు ట్రస్ట్ తరుపున వెంకట్రావు ఈనెల 5వ తేదీ యాదగిరిగుట్టకు వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. వైటీడీఏ సెక్రెటరీ ఎన్ వెంకన్న గౌడ్ ఈ రిజిస్ట్రేషన్ తతంగాన్ని దగ్గరుండి చేయించారు.
అయితే అందరి రైతులకు ఇచ్చినట్టు 15 సంవత్సరాల లీజు, అందులో ఉన్న పాఠశాల భవనానికి లెక్క కట్టి పరిహారం చెలిస్తే సరిపోయేది. లేదా ఇంకో దగ్గర ప్రభుత్వ భూమిని లీజుకు ఇస్తే సరిపోయేది. కానీ, ఇక్కడే కేసీఆర్ ప్రభుత్వం స్వామిభక్తి చూపించింది. ఏదైతే రైతుల నుంచి సేకరించిన భూమి వుందో అందులోంచి 2.30 ఎకరాలు తీసి ‘జీవ’ ట్రస్ట్‌కి రిజిస్టర్ చేసింది. పెద్ద గుట్ట పరిధిలోని సర్వే నెంబర్ 172 లోని 19.14 ఎకరాలలోని 172 (బీ)కి చెందిన 2.30 ఎకరాల భూమిని రూ. 16.50 లక్షలకు వైటీడీఏ అతి తక్కువ ధరకు అమ్మింది. మార్కెట్లో ఈ భూమి ధర దాదాపు 10 కోట్ల వరకు ఉంటుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… జీవ ట్రస్ట్ నుంచి సేకరించిన భూమి ప్రభుత్వ భూమి. అది లీజుకు ఇచ్చింది. ఇంకో 15 సంవత్సరాలు అయితే ఆ లీజు గడువు పూర్తవుతుంది. దానికి పరిహారంగా ప్రభుత్వం ఇంకో 15 సంవత్సరాలు భూమిని లీజుకు ఇవ్వడం మానేసి, పూర్తిగా భూమిని సాములోరికి అమ్మేసింది.
యాదాద్రి అభివృద్ది కోసం రైతులు భూమి ఇచ్చారు తప్ప, ఇతరులకు అమ్మడం కోసం కాదు అన్న సంగతి కేసీఆర్ ప్రభుత్వం మర్చిపోయింది.
రూల్స్ ప్రకారం కొన్న ధర కంటే తక్కువ రేటుకు భూమి అమ్మకూడదు. అంతేకాదు, నిబంధనల ప్రకారం అభివృద్ధి చేసిన భూమిని ఎకరాల చొప్పున కూడా అమ్మకూడదు.
మొన్న స్వరూపానంద స్వామికి రాజధాని నడిబొద్దున్న కోట్లు విలువ చేసే భూమిని రూపాయికి ఎకరం కేటాయించడం.. ఇప్పుడు చినజియర్ స్వామికి యదాద్రిలో భూమి ఇవ్వడం.. ఇవ్వని చూస్తుంటే ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకుందీ అని ఉద్యమకారులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఆంధ్రా వాళ్ళు హైదరాబాద్ చుట్టూ భూములు కబ్జా చేశారని టీఆర్ఎస్ వాళ్లు రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు మళ్లీ వాళ్ళకే విలువైన భూముల్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పనంగా అప్పచెపుతోంది.
ఈ భూముల కేటాయింపును వ్యతిరేకిస్తూ ఓయూ జాక్‌కి చెందిన జయశంకర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అది సెప్టెంబర్ 24వ తేదీన ధర్మాసనం ముందుకు వస్తుంది. నిన్నటికి నిన్న ఎర్రమంజిల్ కూల్చివేతను హైకోర్టు అది వృధా ఖర్చు అని తోసిపుచ్చింది. ఈ కేసులో కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు పడటం ఖాయమని ఉద్యమకారులు పేర్కొంటున్నారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ప్రజాప్రతినిధుల, నాయకులు అడ్డగోలుగా కబ్జా చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేదు. ప్రభుత్వ పెద్దలు కూడా తమ అనుయాయులకు, ఇలాంటి స్వాములకు ఇష్టారాజ్యాంగా భూములను కేటాయిస్తున్నరంటూ జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు!