ఫిబ్రవరి 17, 2021.. సరిగ్గా ఏడాది క్రితం.. రామగిరి మండలం కలవచర్లలో నడిరోడ్డుపై అత్యంత దారుణంగా అడ్వకేట్ దంపతులు వామనరావు, నాగమణి హత్య జరిగింది. సంవత్సరం అయినా కూడా ఈ కేసులో ప్రధాన నిందితులు సైడయ్యారనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. గుంజపడుగు గ్రామానికి చెందిన గట్టు వామనరావు, నాగమణి హైకోర్టులో న్యాయవాదులుగా పని చేస్తున్నారు. కోర్టు పనిమీద మంథనికి కారులో వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా హత్యకు గురయ్యారు.
ఈ హత్య కేసులో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు. వారిలో ఒకరు అనారోగ్య కారణాలతో పెరోల్ పై బయటకు వచ్చాడు. మిగిలిన ఆరుగురు జైలులోనే ఉన్నారు. అయితే.. ఈ డబుల్ మర్డర్ వెనుక పెద్ద కుట్ర ఉందని అప్పట్లో ప్రతిపక్షాలు, న్యాయవాదులు, వామనరావు తల్లిదండ్రులు ఆరోపించారు. తెరపైకి మాజీ ఎమ్మెల్యే పేరు వచ్చింది. కేసుపై పూర్తిస్థాయి విచారణ జరపలేదనే విమర్శలున్నాయి. ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.
టీఆర్ఎస్ పార్టీకి చెందిన మండలాధ్యక్షుడు కుంట శ్రీను.. వామనరావు దంపతులను హత్య చేశాడు. ఆనాటి రక్తచరిత్రను చూసిన స్థానిక ప్రజలు ఇప్పటికీ ఆ ఘటన పేరెత్తితే వణికిపోతున్న పరిస్థితి. ఇందులో అసలు నిందితులను ప్రభుత్వం వదిలేసిందనేది ప్రతిపక్షాల వాదన. విచారణ పూర్తిస్థాయిలో జరపకుండా ఛార్జ్ షీట్ వేశారని.. అసలు నిందితులు బయట తిరుగుతున్నారని అంటున్నాయి.
ఈ కేసుపై సీబీఐ ద్వారా విచారణ జరపాలని మొదట్నుంచి డిమాండ్ వినిపిస్తోంది. అప్పుడే అసలు నిందితులు బయటకు వస్తారని అంటున్నాయి ప్రతిపక్షాలు. వామనరావు తల్లిదండ్రుల అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని.. వారు మాజీ ఎమ్మెల్యే పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే విషయాలు బయటకు రావాల్సి ఉందని చెబుతున్నాయి.
ఇటు వామనరావు దంపతుల హత్య జరిగి ఏడాదయినా.. ఇంకా ఎన్నో అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయని న్యాయవాదులు కూడా అంటున్నారు. ఫాస్ట్రాక్ కోర్టులో కేసు ఇంకా పట్టాలెక్కలేదని.. తెరవెనుక నిందితులున్నారన్న తల్లిదండ్రుల ఆరోపణలకు సమాధానం దొరకలేదని.. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అవసరమని చెబుతున్నారు. వామనరావు దంపతులు మొదటి వర్ధంతి సందర్భంగా న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలని కోరుతూ గురువారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపనున్నారు. ఆ చీకటి రోజును నిరసిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటించాలని మంథని బార్ అసోసియేషన్ న్యాయవాదులను కోరింది.