విజయ్ హీరోగా దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కింది వారసుడు సినిమా. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తమిళ్ లో వారిసుగా విడుదలైంది. అయితే.. ఈ సినిమాపై తమిళనాట చాలా కామెంట్స్ పడ్డాయి. డెయిలీ సీరియల్ చూస్తున్నట్టు ఉందంటూ విమర్శలు వచ్చాయి. వీటిపై వంశీ ఘాటుగా స్పందించాడు.
డెయిలీ సీరియల్ కూడా చాలామందిని అలరిస్తోందని, వాటిని తక్కువ చేసి చూడొద్దన్నాడు దర్శకుడు. సినిమా అనేది టీమ్ వర్క్ అని, ఎంతో కష్టపడి తీస్తామని, దాన్ని డెయిలీ సీరియల్ అంటూ కామెంట్ చేయడం తప్పు అంటున్నాడు. తను ఓ కథను చెప్పాలనుకున్నానని, దాన్ని విశ్లేషిస్తే బాగుంటుందని అన్నాడు.
విజయ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని, ప్రతి డైలాగ్ కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశారని తెలిపిన వంశీ పైడిపల్లి, తనకు తొలి విమర్శకుడు విజయ్ మాత్రమేనని, ఆయన కోసమే వారసుడు సినిమా తీశానని క్లారిటీ ఇచ్చాడు.
ఎన్నో త్యాగాలు చేసి తీసిన సినిమాను కించపరచడం సరైన పద్ధతి కాదన్న వంశీ, నెగెటివ్ గా మాట్లాడితే మనల్ని మనం కిందకు లాక్కున్నట్టే అవుతుందని అన్నాడు. తను ఏదో అద్భుతమైన సినిమా తీశానని చెప్పడం లేదని, సీరియస్ గా ఓ కథను కమర్షియల్ ఫార్మాట్ లో చెప్పే ప్రయత్నం చేశానని తెలిపాడు.