– సోషల్ మీడియాకి ఎక్కిన వనమా దందా
– పైసల పంచాయితీ అంతా ఆడియోలో..
– గతంలో జైలుకెళ్లి వచ్చిన ఎమ్మెల్యే కుమారుడు
– వసూళ్ళ పై వనమా ఫ్యామిలీపై తీవ్ర ఆరోపణలు
బీఆర్ఎస్ లో మరో కొత్త కలకలం రేగింది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఫ్యామిలీ వసూళ్ల పర్వం బట్టబయలైంది. ఎమ్మెల్యే అతని కుమారుడు వసూళ్లకు సంబంధించి మాట్లాడుకుంటున్న ఆడియో క్లిప్ ఒకటి ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఆయన తనయుడు వనమా రాఘవ మధ్య పైసల పంచాయితీ అంతా ఆ ఆడియో క్లిప్ లో ఉంది.
అయితే వనమా కుమారుడు రాఘవ పై వసూళ్లకు సంబంధించి ముందు నుంచే పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. ఈ బలవంతపు వసూళ్ళ కారణంగానే ఓ కుటుంబం బలవన్మరణానికి కారణమైన రాఘన జైలు ఊచలు కూడా లెక్కి పెట్టి వచ్చాడు. అయితే తాజాగా సీఎం కేసీఆర్ కొత్తగూడెం పర్యటన నేపథ్యంలో నియోజక వర్గంలో చేసిన వసూళ్ల మొత్తానికి సంబంధించి వనమా ఫ్యామిలీ మొత్తం మాట్లాడుకుంటున్న ఆడియో క్లిప్ ఇది.
ఈ సంభాషణ ఎమ్మెల్యే వనమా, ఆయన భార్య, కొడుకు రాఘవ ఇంకా పీఏ రుషి మధ్య వసూళ్లకు సంబంధించి జరిగింది. సీఎం కేసీఆర్ కొత్తగూడెం బహిరంగ సభ కోసం పెద్ద ఎత్తున వనమా ఫ్యామిలీ చందాలు సేకరించినట్టు ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే.. సబ్ రిజిస్ట్రార్ ను పది లక్షలు ఈ ఫ్యామిలీ డిమాండ్ చేయగా.. ఆయన 5 లక్షలు మాత్రమే ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు సమాచారం.
దానికి సంబంధించి 3 లక్షలు వనమా రాఘవకు ఇవ్వగా.. ఇద్దరు తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే ఈ ఆడియో టేపు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.