అదే నిర్లక్ష్యం.. మొన్నామధ్య ఓ యువతికి ఒకేసారి రెండు డోసుల టీకాలు వేసి వార్తల్లో నిలిచిన వనస్థలిపురం వైద్య సిబ్బంది… ఇప్పుడు వ్యాక్సిన్లను అక్రమంగా తరలిస్తున్నట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది.
టీకాల కోసం సెంటర్ కు వచ్చిన జనాన్ని అలాగే క్యూలైన్ లో ఉంచి.. సిరంజీ బాక్సుల్లో వ్యాక్సిన్లను తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓ వ్యక్తి వీడియో తీసి వాళ్లను నిలదీశాడు. వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగాడు. అమ్మేందుకు వెళ్తున్నామంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.
ఈ వ్యాక్సిన్ కేంద్రంలో ఇంజెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని.. వేరే చోటకు తీసుకెళ్తున్నామని ఒకరు అంటే… ఇవి గవర్నమెంట్ వి కావని ఇంకొకరు అన్నారు. మరొకరయితే సిరంజీలు తీసుకెళ్లి వ్యాక్సిన్లు తెస్తామని చెప్పారు. ఇలా రకరకాల సమాధానాలు చెప్పారు. జీహెచ్ఎంసీ స్వచ్ఛ్ సేవక్ డ్రెస్సుల్లో ఉన్నారు వారంతా.
పైగా వాటన్నింటినీ ప్రభుత్వ వాహనంలోనే తరలించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. అయినా వ్యాక్సిన్ సెంటర్ల నుంచి ఇంజెక్షన్లను ఎలా తీసుకెళ్తారని ప్రశ్నిస్తున్నారు. వాటిలో ముమ్మాటికీ టీకాలే ఉన్నాయని అనుమానిస్తున్నారు స్థానికులు.