బెంగాల్ లో హౌరా-న్యూ జల్పాయ్ గురి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్లు విసిరిన ఏడుగురిని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. మాల్దా జిల్లాలో ఈనెల 2 న ఈ సంఘటన జరిగింది. ఈ ట్రెయిన్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా దీన్ని రికార్డ్ చేసింది. రైలుపై రాళ్లు విసిరిన వాళ్లలో పిల్లలు కూడా ఉన్నట్టు ఈ ఫుటేజీలో కనిపించింది. బహుశా వీరిని ఇతర యువకులే ప్రోత్సహించారా అన్న విషయం తేలవలసి ఉందని రైల్వే అధికారులు చెప్పారు.అయితే తాజాగా ఈనెల 3 న కూడా ఈ రైలుపై ఎవరో రాళ్లు విసిరారు. రైలు న్యూ జల్పాయ్ గురి స్టేషన్ కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. సి-3,సి-6 కోచ్ ల కిటికీల అద్దాలు పగిలాయని తెలిసింది.
రైల్వే భద్రతా సిబ్బందితో బాటు ప్రభుత్వ అధికారులు కూడా రాళ్ళ దాడికి పాల్పడిన వారిని పట్టుకుని లీగల్ చర్య తీసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇది ఏదో ఆషామాషీ వ్యవహారం కాదని, మొదట జరిగిన రాళ్ల దాడిలో 13 సి కోచ్ గ్లాస్ డోర్ దెబ్బ తిన్నదని రైల్వే వర్గాలు తెలిపాయి. పైగా ఎవరైనా ప్రయాణికులు గాయపడే అవకాశం కూడా ఉండేదని ఈ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఆకతాయి కుర్రాళ్ళను ఎవరు రెచ్చగొట్టి ఉంటారన్నదానిపై .. ఈ ఘటన జరిగిన ప్రాంతాలను పోలీసులు గాలిస్తున్నారు.
ఈ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోడీ డిసెంబరు 30 న వర్చ్యువల్ గా ప్రారంభించారు. వందే భారత్ రైలుపై రాళ్ల దాడి ఘటన బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయ వివాదానికి దారి తీసింది. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ-ఎన్ఐఏ చేత దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్ చేయగా.. బెంగాల్ రాష్ట్రాన్ని అప్రదిష్ట పాల్జేసేందుకు జరిగిన కుట్రగా దీన్ని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది.
హౌరా-న్యూ జల్పాయ్ గురి స్టేషన్ల మధ్య ఈ ట్రెయిన్ స్టేటస్ గురించి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసినట్టు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఈ రెండు సంఘటనల వెనుక ఎవరున్నారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.