వందేభారత్’ అని ఎక్స్ ప్రెస్ రైలుకు ఎప్పుడు పేరు పెట్టారో గానీ వరుసగా దాన్ని ‘కష్టాలు’ వెన్నాడుతున్నాయి. మొన్న గాంధీ నగర్-ముంబై మధ్య నడిచే ఈ రైలు రెండు స్టేషన్ల మధ్య గేదెలను ఢీ కొడితే.. ఇంజన్ ముందు భాగం దెబ్బ తిన్నది. నిన్న రెండో రోజు గుజరాత్ లో ఆనంద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రైలు ఓ ఆవును ఢీ కొట్టింది. రెండు రోజుల్లో ఇది రెండు సంఘటనలు కాగా వరుసగా మూడో రోజున కూడా వందేభారత్ ట్రెయిన్ మరో ‘కష్ఠాన్నినమోదు చేసుకుంది’.
శనివారం ఉదయం ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న వందేభారత్ రైలు బులంద్ షహర్ సమీపంలో వైర్ రైల్వే స్టేషన్ వద్ద నిలిచిపోయింది. ఇందుకు కారణం దీని చక్రం జామ్ కావడమే. ఈ జిల్లాలో ఇది సుమారు 6 గంటలపాటు ఉండిపోయిందట . దీంతో ఇందులోని ప్రయాణికులనందరినీ దింపివేసి శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైల్లోకి ఎక్కించారు.
దన్ కౌర్-వైర్ స్టేషన్ల మధ్య ఈ రైలు సి-8 కోచ్ ట్రాక్షన్ మోటార్ లో సాంకేతిక లోపం తలెత్తి వీల్ జామ్ అయిందని నార్త్ సెంట్రల్ రైల్వే అధికారి శివం శర్మ తెలిపారు.
అయితే సిబ్బంది ఈ లోపాన్ని గుర్తించి సరి చేశారని, ఆ తరువాత ఇది మెల్లగా గంటకు 20 కి.మీ. పరిమిత వేగంతో ఖుర్జాకు బయలుదేరిందని ఆయన చెప్పారు. ఈ రైలు కారణంగా దీని వెనుకే వస్తున్న సీమాంచల్ ఎక్స్ ప్రెస్ కూడా నిలిచిపోయింది. వందేభారత్ వారణాసి-ఢిల్లీ ఎక్స్ ప్రెస్ రైలుకు సంబంధించిన ఘటనపై దర్యాప్తునకు ఉన్నతాధికారులు ఆదేశించారు.