వనజీవి రామయ్య” రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక పాపులర్. కోటి మొక్కలు నాటి, లేటు వయసులో కూడా ఆదర్శంగా నిలిచిన ఆయన్ను కేంద్రం పద్మ శ్రీ పురస్కారంతో గౌరవించింది. పలు సామాజిక మాధ్యమాల్లో ఆయనకు భారీ ఎత్తున ఫాలోయింగ్ ఉంది. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య దరిపల్లి రామయ్య. పర్యావరణ పరిరక్షణలో ఈయన చేసిన కృషికి గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారంతో గౌరవించారు.
రామయ్య 60 సంవత్సరాల వయస్సులోనూ అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించి మొక్కలు నాటుతున్నారు. అయితే ఇటీవల ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి వద్ద ఆయనకు రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే తనను గాయపరిచిన వ్యక్తిని క్షమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇక ఈ సందర్భంగా ఆయన చేసిన విజ్ఞప్తి సంచలనం అయింది.
తనను గాయ పరిచిన వ్యక్తి మీద ఏ కేసు పెట్టవద్దని పోలీసులను విజ్ఞప్తి చేసారు. తన కుటుంబ సభ్యులు కూడా ఆ వ్యక్తిపై కేసు పెట్టవద్దని కోరారు. దీనికి బదులు ఆ వ్యక్తి వంద మొక్కలు నాటి వాటిని బాగా చూసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. తీవ్ర గాయాలు కాకపోవడంతో ఆయన వెంటనే కోలుకుంటారని మళ్ళీ మొక్కలు నాటే కార్యక్రమంలో దూకుడుగా ఉంటారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.