రాకరాక కృష్ణానదికి వరద వచ్చింది. నిన్నటి వరకు ఎడారిని తలపించిన నదీగర్భం ఇప్పుడు పొంగి పొర్లుతోంది. కృష్ణానదికి ఈస్థాయి వరద నీరు వచ్చి చేరడం గత కొన్నేళ్లలో ఎప్పుడూ జరగలేదు. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేసి వరద నీళ్లు వదిలేయడంతో బిరాబిరా పరుగులెడుతూ కృష్ణమ్మ దిగువకు పారుతూ సాగరం వైపు పరుగులు తీస్తోంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంతగా ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానది నిండుగా ప్రవహిస్తుండటం.. బలహీనంగా ఉన్కన చోట్ల కరకట్ట దాటి బయటికొచ్చి సమీపంలోని ఇళ్లను ముంచెత్తడం విజయవాడ నగరవాసులకు విడ్డూరంగా కనిపిస్తోంది. వరుస సెలవు దినాలు కావడంతో ఊళ్లెళ్లిన జనం తిరిగి నగరానికి చేరుకుని పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను చూసేందుకు పరుగులు తీస్తున్నారు. విజయవాడ-అవనిగడ్డ మార్గంలో కరకట్టను ఆనుకుని పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మను చూసి పులకరించిపోతున్నారు.
ఈ వరద ఉధృతి తగ్గే ఛాయలు కనిపించడం లేదు కానీ, వరదపై రాజకీయాలు మాత్రం మొదలయ్యాయి. ఈ వరదకు అసలు కారణం పూర్తిగా మానవ తప్పిదమేనని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ఇటీవల గోదావరికి వరద వస్తే పట్టించుకోకుండా జెరూసలెం యాత్ర చేసొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి… ఇప్పుడు కృష్ణానది వరద విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని గ్రామాలను ముంచెత్తే పరిస్థితి ఉన్నా అమెరికా పర్యటన చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి అత్యవసర సమయాల్లో తమ నాయకుడు విపత్తు వున్న ప్రాంతానికి వెళ్లి అక్కడే మకాం వేసి సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించేవారని గుర్తుచేస్తున్నారు. వైసీపీ పాలనలో కనీసం అధికార యంత్రాంగం కూడా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని, వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు.
ఇలావుంటే, ఈ వరదలు పూర్తిగా మానవ తప్పిదం కారణంగా ఏర్పడిన విపత్తేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక కొత్త కోణాన్ని వెలికితీశారు. వరద గేట్ల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే పరిస్థితులు అదుపు తప్పాయని ఆయన అభియోగం. వరద గేట్ల పర్యవేక్షణ పూర్తిగా పట్టించుకోకుండా క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై న్యాయ విచారణ జరపాలని కోరుతున్నట్టు చెప్పారు. కేంద్ర హోంశాఖకు, జలవనరుల శాఖకు దీనిపై ఫిర్యాదు చేసి న్యాయ విచారణ కొరతామని తెలిపారు.