జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొండగట్టుకు పయనం అయ్యారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆలయానికి బయలుదేరారు. జనసేన ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’ వాహనానికి ప్రత్యేక పూజలు జరిపించనున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి పవన్ ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు.
ఇప్పటికే ఎన్నికల ప్రచార రథం వారాహి కొండగట్టుకు చేరుకుంది. తెల్లవారే సరికి అంజన్న సన్నిధిలో ఇది ప్రత్యక్ష్యం కావడంతో ఈ వాహనాన్ని చూసేందుకు చాలామంది తరలివస్తున్నారు. డే టైంలో అయితే.. సకాలంలో చేర్చలేమని ముహూర్తం సమయానికి వారాహి కొండగట్టులో ఉండాలని భావించిన జనసేనాని.. రాత్రికి రాత్రే అంజన్న సన్నిదానానికి తీసుకెళ్లాలని సూచించారు.
ఈ సారి తెలంగాణలోనూ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టాలని పవన్ యోచిస్తున్నారు. దీనిపై ఈ పర్యటనలో పార్టీ నేతలతో చర్చలు జరపనున్నారు. అంజన్న దర్శనం చేసుకుని మధ్యాహ్నం ఒంటిగంటకు నాచుపల్లి శివార్లలోని బృందావన్ రిసార్టులో తెలంగాణకు చెందిన పార్టీ ముఖ్యులతో భేటీ కానున్నారు పవన్.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చలు జరపనున్నారు. సాయంత్రం 4 గంటలకు ధర్మపురి చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అక్కడి నుంచే అనుష్టుప్ నారసింహ యాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన)ను మొదలు పెట్టనున్నారు. ధర్మపురిలో దర్శన అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్ తిరుగుపయనం అవుతారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో ఈసారి కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయనుంది.