రీఎంట్రీలో మెగాస్టార్ మంచి జోరు మీదున్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టి కుర్ర హీరోలకు సవాల్ విసురుతున్నాడు. ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్న చిరు… దాని తర్వాత వేదాళం, లూసిఫర్ రీమేక్‌లోలలో నటించాల్సి ఉంది. ఇందులో లూసిఫర్‌కు సంబంధించిన ఓ క్రేజీ వార్త ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది.
లూసిఫర్ మూవీలో చిరుకు చెల్లెలిగా ఓ పవర్ ఫుల్ పాత్ర ఉంటుంది. ఒకానొక దశలో చిరును ఢీకొట్టే రోల్ అది. అలాంటి పాత్రకు సూటబుల్ యాక్టర్ కోసం చాలా రోజులుగా మూవీ టీం వెతుకుతూనే ఉంది. ఆ మధ్య నయనతార ఓకే అయిందని చెప్పుకున్నారు. కానీ ఫైనల్ కాలేదు. కొంచెం నెగెటివ్ టచ్ పాత్ర కావడంతో ఎవరూ ఒప్పుకోలేదట. అయితే తాజాగా ఈ పాత్రకు ఇప్పుడు వరలక్ష్మిని అనుకుంటున్నారని తెలిసింది. ఇటీవల క్రాక్, అలాగే నాంది సినిమాల్లో ఆమె నటనను చూసిన చిరు చాలా ఆశ్చర్యపోయారు. స్వయంగా ఫోన్ చేసి అభినందించారు కూడా. నెగెటివ్ రోల్‌ను ఎంతో అద్భుతంగా పోషిస్తున్న వరలక్ష్మినే తన చెల్లి పాత్ర కోసం తీసుకోవాలని చిరు రికమెండ్ చేశారని టాక్ వినిపిస్తోంది.
ఆచార్య తర్వాత లూసిఫర్ పట్టాలెక్కనుంది. ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేస్తాడు. లూసిఫర్ మాతృకలో హీరోయిన్ ఉండదు. దీంతో ఈ సినిమాలో కూడా ఉండదని వినికిడి.