ఎంతో ఘనంగా పెళ్లి చేసుకుని వధువును తీసుకుని ఇంటికి బయల్దేరిన వరుడికి దారి మధ్యలోనే పెద్ద షాక్ తగిలింది. కారులో మెట్టింటికి బయల్దేరిన వధువు.. ఎంతసేపటికి ఇల్లు రాకపోవడంతో మార్గమధ్యలోనే ఏడుపు లంకించుకుంది. అత్తగారిల్లు చాలా దూరం ఉంది.. నేను మా ఇంటికే వెళ్లిపోతా అంటూ కారులో నుంచి దిగి రోడ్డుపైనే బోరున విలపించింది.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ఓ యువతికి రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడితో ఇటీవల పెళ్లి జరిపించారు. వరుడి ఇల్లు చాలా దూరంలో ఉండటంతో త్వరత్వరగా పెళ్లి మండపం నుంచి కారులో సాగనంపారు. మెట్టింటికి బయల్దేరి ఎంతసేపు అయినా రావట్లేదు.. ఇంకా జర్నీ తగ్గడం లేదు. దీంతో ఆమె భయం మరింత పెరిగిపోయింది. ఇంతలోనే గుండెల్లోని బాధ కన్నీళ్ల రూపంలో బయటకు పొంగుకొచ్చాయి.
అంతే కారులో బోరున ఏడుపు అందుకుంది. అత్తారిల్లు చాలా దూరం ఉంది.. రాజస్థాన్‌కు రాను. వారణాసిలో మా పుట్టింటికి వెళ్లిపోతా అంటూ ఏడుపు లంకించుకుంది. ఈ హఠాత్పరిణామంతో షాకైన వరుడు, అతని బంధువులు రోడ్డు పక్కన కారు ఆపి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ కారు దిగిన పెండ్లి కూతురు రోడ్డు మీద ఏడుస్తూ కూర్చొంది.
రోడ్డుపై వరుసగా వాహనాలు ఆగి ఉండటం.. పెండ్లి దుస్తుల్లో అమ్మాయి ఏడుస్తూ కనిపించడంతో పోలీస్ రెస్పాన్స్ వాహనం సిబ్బంది మహరాజ్‌పూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు వాళ్లను అడిగి వివరాలను సేకరించారు. అన్ని విషయాలు ధ్రువీకరించుకున్న తర్వాత మహిళా సిబ్బంది సహాయంతో వధువును వాళ్ల పుట్టింటికి పంపించారు.