వారణాసి విశ్వవిద్యాలయానికి చెందిన ఓ గెస్ట్ లెక్చరర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేవీ నవరాత్రుల సమయంలో మహిళల ఉపవాసంపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. చివరకు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు.
వర్సిటీ పరిధిలో మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్‌లో రాజనీతి శాస్త్ర గెస్ట్ లెక్చరర్‌గా డాక్టర్ మిథిలేష్ కుమార్ గౌతమ్ పని చేస్తున్నారు. దేవీ నవరాత్రుల సమయంలో మహిళలు తొమ్మిది రోజులు ఉపవాసానికి బదులుగా భారత రాజ్యాంగాన్ని, హిందూ కోడ్ బిల్లును చదవాలని సూచించారు.
అలా చేయడంతో వారి జీవితాలు భయం, బానిసత్వం నుంచి విముక్తి పొందుతాయని ట్వీట్ చేశారు. దీంతో అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. దీనిపై వివాదం చెలరేగింది. ఆయన చర్యను కొందరు విద్యార్థుల సమర్థించారు. మరికొందరు ఆయనపై చర్య తీసుకోవడాన్ని తప్పుబట్టారు.
కొందరు హిందూ దేవుళ్లను, మహిళలను అవమానించిన సదరు వ్యక్తిపై చర్యలు సరైనవేనని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం దీన్ని తప్పుబట్టారు. లెక్చరర్ దళితుడని, అందుకే అతన్ని బలిపశువును చేశారని మండిపడుతున్నారు.
డాక్టర్ గౌతమ్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సునీతా పాండే పేర్కొన్నారు. ఏ మతంపైనా, మహిళలపైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికీ లేదని ఆమె తెలిపారు. దీనిపై తమకు విద్యార్థులు ఫిర్యాదు చేపినట్టు తెలిపారు.