మీకు తెలిసిన రెండు, మూడు హోటళ్ల పేర్లు టక్కున చెప్పండి.. సాయిరాం ఉడిపి హోటల్, లక్ష్మి మెస్, మణికంఠ ఫుడ్ కోర్ట్, సో అండ్ సో రెస్టారెంట్.. ఇలా ముందు ఏ దేవుని పేరో లేదా.. కుటుంబంలో బాగా కలిసొచ్చే సభ్యుల పేర్లో ముందు పెట్టి .. ఆ తర్వాత టిఫిన్ సెంటర్ అనో, మెస్ అనో, రెస్టారెంట్ అనో.. ఇంకాస్తా ట్రెండీగా ఫుడ్ కోర్ట్ అని తగిలించేస్తుంటారు ఎవరైనా. ఇదంతా నిన్నటి తరం ట్రెండ్. కట్ చేస్తే ఇప్పుడు దేవుడి మీద భారం వేయడం, అదృష్టం కోసం పండితుడు చెప్పిన అక్షరంతోనే హోటల్ పేర్లు పెట్టడం వంటి పనులకు ఈతరం టాటా చెప్పేసింది. వ్యాపారం అన్నాక కాసింత చమత్కారం ఉండాలన్న సూత్రాన్ని ఒంటబట్టించుకుంటోంది. ఇటీవల హోటళ్లకు పెడుతున్న పేర్లు చూస్తే తెగ నవ్వొచ్చేస్తోంది.లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీరియస్‌గా వ్యాపారం చేద్దామని వస్తున్నవాళ్లు కూడా .. హోటళ్లకు సరదా పేర్లను పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు.
రా బావా తిని చూడు.. ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన హోటల్ పేరు ఇది. చూసినవారంతా పేరు పెట్టినవారి గురించి తలుచుకొని నవ్వుకోవడమే కాదు.. ఆ హోటల్ ఎక్కడ ఉందా అని ఆరాలు తీసేవరకూ వెళ్లారు. దానికి ముందు సోషల్ మీడియాలో తెగ షేర్ అయిన మరో హోటల్.. పొట్ట పెంచుదాం.. చదివిన మరుక్షణమే ఘోళ్లున నవ్వని మనిషి ఎవరైనా ఉంటారా..!
ఇలాంటిదే మరో హోటల్ పేరు నాపొట్ట నా ఇష్టం.. అంతే కదా మరి. ఇక రీసెంట్‌గా ఫార్వర్డ్ అవుతున్న మరో హోటల్ పేరు ఏం బాబు తిన్నారా.. హోటల్ ఓనరే ఎదురొచ్చి అడిగినట్టు లేదూ. ఇవీగాక తాలింపు, అరిటాకు, చిట్టి మిరియం, కోడికూర చిల్లీగారె వంటి పేర్లు కూడా అక్కడక్కడ కనిపిస్తూ కస్టమర్లను ఊరిస్తున్నాయి.
తెలుగులోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నవాళ్లూ ఉన్నారు. అలాంటిదే సెకండ్ వైఫ్ రెస్టారెంట్. ఎవరైనా ఎక్కడ తిన్నావు అని అడిగితే.. సెకండ్ వైఫ్ దగ్గర అంటే ఎలా ఉంటుంది.. అన్న వారి ఆలోచనే ఆ పేరు పెట్టేలా చేసింది.
ఆయా హోటళ్లలో ఆహారం రుచి ఎలా ఉంటుందో తెలియదుగానీ.. ఒక్కసారైనా అందులోకి అడుగుపెట్టాలని అనుకోని వారు ఎవరు ఉండరు చెప్పండి! పేర్లు సంగతి ఎలా ఉన్నా మొత్తానికి ఓ కొత్త ట్రెండ్ మొదలైపోయింది.