వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. రేపల్లె ఘటన బాధితురాలిని ఒంగోలు రిమ్స్‌లో వర్ల రామయ్య పరామర్శించారు. బాధితురాలికి టీడీపీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో మహిళలు పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి ఉందని, అవగాహన లేని వ్యక్తి సీఎం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన మండిపడ్డారు. శాంతి భద్రతలు లేని కారణంగానే రేపల్లె లాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయని మండిపడ్డారు. బాధితురాలు భయంతో ఇప్పటికీ వణికిపోతుందని, వైసీపీ ప్రభుత్వం ముద్దాయిలతో స్నేహంగా ఉంటుందని విమర్శించారు.
రాష్ట్రంలో రోజుకి మూడు మాన భంగాలు, ఆరు హత్యలు జరుగుతున్నాయని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల విఘాతం, ప్రభుత్వ ఘోర వైఫల్యం అంటూ ఆయన ధ్వజమెత్తారు. హోంమంత్రి తానేటి వనితకు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదా..? అని ఆయన ప్రశ్నించారు. అత్యాచారం జరిగితే.. ఎప్పుడు జరిగింది..? ఎన్ని గంటలకు చేశారు..? ఎంతమంది చేశారు..? అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Advertisements
ఈ సందర్భంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. దళిత మహిళల గురించి మాట్లాడేటప్పుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్నారు. మంత్రి పదవి పోయినా బాలినేని శ్రీనివాసరెడ్డికి పొగరు తగ్గలేదంటూ మండిపడ్డారు. బాలినేని ఇప్పుడు ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యే మాత్రమేనని, బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం మొత్తం బయటకు తీస్తామని విమర్శించారు. రేపల్లె బాధితురాలికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని.. ఐదు ఎకరాల పొలం, కుటుంబంలో ఒకరిని ఉద్యోగం ఇవ్వాలని వర్ల రామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.