తెలియకుండా చేస్తారో.. కావాలని తెలిసే చేస్తారో గానీ.. సెలెబ్రిటీలు చేసే పనులు అప్పుడప్పుడు వివాదాలకు కారణమౌతుంటాయి. ఇప్పుడు బాలీవుడ్ క్వీన్ కియారా, వరుణ్ చేసిన పని అలాగే ఉంది. సోషల్ మీడియాలో వీరిద్దరిని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
వరుణ్ ధావన్ తో కలిసి కియారా ‘జుగ్ జుగ్ జియో’ అనే సినిమా చేసింది. రాజ్ మెహతా దర్శకుడు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. అయితే.. సినిమా ప్రమోషన్స్ లో చిత్రబృందం ఇప్పటి నుంచే స్పీడ్ పెంచింది. ముంబైలోని మెట్రో రైల్లో సందడి చేసింది.
ట్రైన్ రన్నింగ్ లో ఉన్న సమయంలో వరుణ్, కియారా వడ పావ్ తింటూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇది మెట్రో రూల్స్ కు విరుద్దమంటూ ఇద్దరిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
మెట్రోలో ఆహార పదార్థాలకు అనుమతి లేదనే విషయం కూడా తెలియదా?, వీరిపై మెట్రో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వరుణ్, కియారాలతో పాటు సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా ఈ ప్రమోషన్ లో పాల్గొన్నారు.