భారీ అంచనాల మధ్య వచ్చిన గని సినిమా డిజాస్టర్ అయింది. 21 కోట్ల రూపాయలకు సినిమాను అమ్మితే.. ఇప్పటివరకు కేవలం 4 కోట్ల 30 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇక ఈ సినిమాకు వసూళ్లు రావడం కష్టం. ఈరోజు బీస్ట్ వచ్చేసింది. రేపట్నుంచి కేజీఎఫ్ 2 హంగామా మొదలుకాబోతోంది. సో.. గని సినిమా క్లోజింగ్ కు వచ్చినట్టే. ఈ సినిమా ఇక కోలుకోవడం కష్టమని తేలిపోయింది.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తన ఫ్యాన్స్ కోసం, ప్రేక్షకుల కోసం ఓపెన్ లెటర్ రాశాడు వరుణ్ తేజ్. తమ సినిమా ఫ్లాప్ అయిందనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు. ముందుగా తాము ఓ ఐడియా అనుకున్నామని, కానీ తెరపైకి వచ్చేసరికి అది సరిగ్గా ఎగ్జిక్యూట్ కాలేదని చెప్పుకొచ్చాడు వరుణ్. ప్రతి సినిమాకు తన కష్టం ఒకేలా ఉంటుందని, రాబోయే చిత్రాల కోసం మరింత కష్టపడతానని ముగించాడు.
సరిగ్గా ఇలాంటి పని కొన్నేళ్ల కిందట రామ్ చరణ్ కూడా చేశాడు. అతడు నటించిన వినయ విధేయ రామ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. కానీ రిలీజైన మొదటి రోజే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. దీంతో రామ్ చరణ్ కూడా బహిరంగ లేఖ రాశాడు. సినిమా నిరాశపరిచినందుకు ఫ్యాన్స్ కు సారీ చెప్పాడు. ఆ టైమ్ లో చరణ్ చేసిన పనికి, దర్శకుడు బోయపాటి కాస్త ఫీల్ అయ్యాడు కూడా.
ఆ ఘటనను దాదాపు అంతా మరిచిపోయారనుకున్న టైమ్ లో ఇప్పుడు వరుణ్ తేజ్ లెటర్ బయటకొచ్చింది. దీంతో గతంలో రామ్ చరణ్ చేసిన పనిని అంతా మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి ఇది మంచి సంప్రదాయమే. సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఇలా సంజాయిషీ ఇచ్చుకుంటే హీరోలకు మరింత బాధ్యత పెరుగుతుంది.