ఒక్క టైటిల్ వివాదంతో తలబొప్పి కట్టిన గద్దలకొండ గణేష్ మూవీ టీంకు రిలీజ్ తర్వాత హిట్ టాక్‌తో కొండంత దైర్యం వచ్చింది. దమ్మున్న మూవీని హిట్ కాకుండా ఎవరూ అడ్డుకోలేరన్న ధీమా వచ్చింది. కానీ పైరసీ భూతం పెనుముప్పులా దాపురించింది. తమిళ్ మూవీ రాకర్స్ మార్నింగ్ షో కాగానే గద్దలకొండ గణేష్ నెట్లో పెట్టేశారు. ఎంత దైర్యం? పైరసీదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేరా? టాలీవుడ్ దీనికి కౌంటర్ వేయలేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిర్మాతల వెన్ను విరిచే పైరసీదారుల అకృత్యాలు టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ పతనానికి దోహదం చేసే ప్రమాదం ముంచుకొస్తోంది.
మూవీ రిలీజ్‌కు ఒక్కరోజు ముందు టైటిల్ వివాదం షేక్ చేసింది. అలనాడు అడవి బిడ్డ కపోత విలాపంతో కరకు మనిషి మహాకవి వాల్మీకిగా ఘనత వహించారు. అదే టైటిల్ హరీష్ శంకర్ ఎందుకు ఎంచుకున్నారో కానీ బాగా డిస్ట్రబ్ అయిపోయాడు. తమిళ్ జిగర్తాండ మూవీని రీమేక్ చేసి తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేద్దామనుకుంటే కంటిమీద కునుకు లేదు. టైటిల్ మార్చాలన్న వాల్మీకుల డిమాండుకు తలవంచక తప్పలేదు. రాయలసీమలో కొన్ని చోట్ల మూవీ రిలీజ్ రద్దు చేయడంతో చివరకు ఒక్కరోజు ముందు అదీ కొన్ని గంటల ముందు టైటిల్ మార్చుతామని కోర్టుకు చెప్పి గద్దలకొండ గణేష్‌గా మార్చి రిలీజ్ చేశారు. హిట్ టాక్ సొంతం చేసుకున్న నేపద్యంలో పైరసీ ఇష్యూ ఇప్పుడు చికాకు పరుస్తోంది. దీనిపై చిత్ర బృందం ఏం యాక్షన్ తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.