బిగ్‌బాస్ హౌసులో చాలా జరిగిపోతున్నాయ్. వరుణ్ వైఫ్ వితికా షెరు బిగ్‌బాస్ హౌస్ కెప్టెన్‌గా ఎన్నికైంది. ‘బరువులెత్తగలవా.. జెండా పాతగలవా’ అనే కెప్టెన్సీ టాస్క్‌లో శ్రీముఖి, మహేష్‌లతో పోటీపడి వితికా నెగ్గింది. కానీ, ఆ కిస్సులు.. హగ్గులు ఏంటండీ బాబూ.. అంటూ నెటిజెన్లు గొణుక్కుంటున్నారు.
వరుణ్ సందేశ్ తన భార్య వితికాను ఎత్తుకున్నాడు. రవి.. శ్రీముఖిని, మహేశ్.. శివజ్యోతిని ఎత్తుకున్నారు. ఒక సైడ్ ఉన్న జెండాలను మరోవైపు పెట్టాలి. అలా ఎండ్ ప్లేస్ వరకు ఎక్కువ జెండాలను పెడితే వారే కెప్టెన్. అదే టాస్క్. ఈ టాస్కులో వరుణ్, మహేష్ చాలా కష్టపడ్డారు. శ్రీముఖిని ఎత్తుకున్న రవికి ఈ టాస్క్ చేయడం చాలా కష్టమైపోయింది. చివరాఖరికి ఈ టాస్క్‌లో అందరికంటే ఎక్కువ జెండాలను పాతి వితికా విన్నర్‌గా నిలిచింది.
ఇక కెప్టెన్‌గా ఎన్నికైన వితికా ఆనందానికి అవధుల్లేవు. ‘ఆకాశంలో ఆశల హరివిల్లూ..’ అంటూ స్వర్ణకమలం సినిమాలో భానుప్రియ చెలరేగిపోతుంది చూశారా.. అచ్చం అలా సంతోషంతో ఎగిరి చిందులేసింది.
పాపం వరుణ్ పరిస్థితి చూడాలి..! ఎత్తుకుని కెప్టెన్‌ని చేసిన వరుణ్‌ని ముద్దులతో ముంచెత్తేసింది వితిక.
‘నా జీవితానికి ఇది చాలు.. నేను బిగ్ బాస్ సీజన్ 3లో కెప్టెన్ అయ్యానహో..’ అంటూ దొరికిన వాళ్లకు దొరికినట్టుగా హగ్‌లు ఇచ్చేసింది. తనతో పాటు గేమ్ ఆడిన ఇంటి సభ్యుల్ని వెక్కిరస్తూ చిందులేసింది. ‘హలో.. కెప్టెన్ కావడంతో అయిపోలేదు ముందు కెప్టెన్‌గా ఎలా ఉండాలో నేర్చుకో.. ఊ.. హాలు కాదు.. సరిగా ఉండు ముందు’ అంటూ వరుణ్ కాస్త చివాట్లు పెట్టాడు. ఐనా కూడా వితికా ఆగలేదు. ఆమెగారికి పునర్నవీ తోడయ్యింది. ఇద్దరూ కలిసి తెగ సంబర పడిపోయారు.
ఇక పునర్నవి-రాహుల్ మధ్య గొడవ జరిగిందండీ. అదేంటంటే.. కెప్టెన్సీ టాస్క్‌లో వితికాకు రాహుల్ సహాయం చేస్తానని చెబుతున్నాడా.. మధ్యలో కలగజేసుకుని చెయ్యి నొప్పి, కాలు నొప్పి అంటావ్ నీకవసరమా? అని నవీ ఎద్దేవాచేసింది. ఇదే విషయాన్ని టాస్క్ తర్వాత వితికా, పునర్నవి, వరుణ్ డిస్కషన్ పెడితే.. రాహుల్ మధ్యలో వచ్చి ఫైర్ అయ్యాడు. ‘నువ్వెందుకలా అన్నావ్’ అంటూ పునర్నవిని మందలించాడు. ‘నువ్వు చేయలేవు కాబట్టి అన్నాను’ అంటూ కౌంటరిచ్చింది నవీ. ఇద్దరికీ మాటామాట పెరిగింది. అందరి ముందు తనను అలా అనడం తనకు నచ్చలేదంటూ వరుణ్‌తో రాహుల్ చెప్పుకొచ్చాడు. మళ్లీ కాసేపయ్యాక కాఫీ ఇచ్చేందుకు వచ్చిన పునర్నవితో రాహుల్ సీరియస్‌గానే మాట్లాడాడు. ఇక నేను పునర్నవితో మాట్లాడనని అనేశాడు. మరోవైపు వితికా-పునర్నవి కూడా రాహుల్ గురించి డిస్కషన్ పెట్టారు. రాహుల్ గురించి కాసేపు ఇద్దరూ చెవులు గొరుక్కున్నారు.
ఇక… హయర్ రిఫ్రిజిరేటర్ టాస్క్‌ను ఇచ్చిన బిగ్‌బాస్.. ఇంటి సభ్యుల్లోంచి ఎవరో ఒకర్ని ఎంచుకోవాలని చెప్పాడు. వారికి ట్రిక్ లేదా ట్రీట్‌ను ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. ట్రిక్ అంటే ఐస్ క్యూబ్‌ను వారి మీద వేయడం.. ట్రీట్ అంటే ఫ్రిజ్‌లో ఉన్న స్నేక్స్ తీసి ఇవ్వడం అన్నమాట!
ఇక శ్రీముఖి.. బాబా భాస్కర్‌కు, శిల్పా.. రాహుల్‌కు ట్రిక్‌ను ఎంచుకుని వారి మీద ఐస్‌క్యూబ్స్ వేశారు. మిగతా హౌస్‌మేట్స్ అందరూ ట్రీట్ ఇచ్చుకున్నారు. అప్పుడప్పుడు హౌస్మేట్స్‌ను హ్యాపీగా వుంచేందుకు బీబీ ఇలాంటివి పెడుతుంటాడు. ముందు ఎపిసోడ్‌లో నవీ ఎదురుతిరిగిందా.. ‘నామాటే శాసనం’ అన్నట్టుగా బిగ్‌బాస్ కన్నెర్ర చేయడంతో కామ్ అయిపోయింది.