వరుణ్ తేజ్ నుంచి ఒక సినిమా వచ్చేసింది. గని సినిమా ఈరోజు రిలీజైంది. ఇప్పుడు ఆయన నటిస్తున్న ఎఫ్3 సినిమాపై అందరి దృష్టి పడింది. నిజానికి గని ప్రమోషన్స్ లోనే చాలామంది వరుణ్ ను ఎఫ్3 మూవీ గురించి అడిగారు. ఆ సినిమా క్రేజ్ అలాంటిది. ఇప్పుడిప్పడే గని ఫీవర్ నుంచి బయటకొస్తున్న వరుణ్ తేజ్, ఎఫ్ 3 మూవీపై స్పందించాడు. ఆ సినిమా చూస్తున్నంతసేపు ఎవ్వరూ సీట్లలో కూర్చోరని చెబుతున్నాడు ఈ మెగా హీరో.
“ఎఫ్3 సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు సీట్లలో కూర్చోరు. ఎగిరి నవ్వుతూనే ఉంటారు. ఎఫ్3 సినిమా అంత హిలేరియస్ గా ఉంటుంది. ఎఫ్2 సినిమాలో ఎంత ఫన్ చూశారో, దానికి 3 రెట్లు ఫన్ ఎఫ్3 మూవీలో ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ లో ప్రతి రోజును నేను ఎంజాయ్ చేశాను. వెంకటేష్ గారితో మరింత కలిసిపోయాను. నేను ఎంత ఎంజాయ్ చేశానో, ప్రేక్షకులు దానికి రెట్టింపు ఎంజాయ్ చేస్తారు. ఇది నా గ్యారెంటీ.”
ఇలా ఎఫ్3 సినిమాపై స్పందించాడు వరుణ్ తేజ్. ఇంకా సెట్స్ పై ఉన్న ఈ సినిమా షూటింగ్ మరో నెల రోజుల్లో పూర్తయిపోతుందని ప్రకటించాడు వరుణ్ తేజ్. అనీల్ రావిపూడి కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా ఎఫ్3 నిలిచిపోతుందని చెబుతున్నాడు. డబ్బు కాన్సెప్ట్ తో వస్తున్న ఎఫ్3 మూవీలో ఎప్పట్లానే వెంకీ సరసన తమన్న, వరుణ్ సరసన మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు.
కొత్త ఫ్రాంచైజీలో సునీల్, సోనాల్ చౌహాన్ లాంటి నటీనటులు కూడా చేరడంతో ఈసారి సినిమా మరింత రిచ్ గా, కలర్ ఫుల్ గా ఉంటుందని చెబుతున్నాడు వరుణ్ తేజ్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.